విధాత: తమ పిల్లలను సోషల్ మీడియా (Social Media) వేదికలపై ఇన్‌ఫ్లూయెన్సర్‌లుగా ఉపయోగిస్తూ డబ్బు సంపాదిస్తున్న తల్లిదండ్రులు ఈ కాలంలో చాలా మందే ఉన్నారన్న విషయం తెలిసిందే. అలాంటి బాల ఇన్‌ఫ్లూయెన్సర్ (Minor Influencer) ల హక్కులను కాపాడేందుకు తొలిసారిగా అమెరికా (America) లోని ఇల్లినాయిస్ రాష్ట్రం నూతన చట్టాన్ని రూపొందించింది.
ఇకపై సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చిన మొత్తంలో కొంత వాటాను తమ పిల్లలకు ఇవ్వాల్సిందేనని.. అలా జరగకపోతే ఏ మైనర్ ఇన్‌ఫ్లూయన్సర్ అయినా వారి తల్లిదండ్రులపై దావా వేయొచ్చని ఈ చట్టంలో పొందుపరిచింది. భారతీయ సంతతికి చెందిన 16 ఏళ్ల శ్రేయ నల్లమోతు (Shreya Nallamothu) అనే బాలిక ఆలోచనతో ఈ చట్టాన్ని రూపకల్పన చేసినట్లు ఇల్లినాయిస్ చట్టసభ వెల్లడించింది.
Can the parents deduct the amount from the cost of services provided? IL teenager Shreya Nallamothu inspires bill: Children will be able to SUE their own parents if they fail to pay them profits on social media posts they feature inhttps://t.co/EXt1ilzCVX https://t.co/s81LGwxK4P
— atasteofcreole (@atasteofcreole) August 16, 2023
కొవిడ్‌లో వీడియోలు చూస్తుండగా..
కొవిడ్ సమయంలో శ్రేయ.. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో వీడియోలు చూస్తుండగా.. చిన్న పిల్లలతో చేసిన వీడియోల సంఖ్య ఎక్కువ కావడం కనిపించింది. అందులోనూ ఫ్యామిలీ వ్లాగింగ్ పేరుతో కుటుంబంలో ప్రైవేట్‌గా ఉండాల్సిన విషయాలను ఎక్కువ మంది చూపించేస్తున్నారని.. దీని వల్ల పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని భావించింది. ఈ విషయాలన్నింటినీ ప్రస్తావిస్తూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్ డేవ్ కోహ్లెర్‌కు లేఖ రాసింది. ఇలాంటి వ్లాగ్‌లపై చర్యలు తీసుకోవాలని, మైనర్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు రక్షణ కల్పించాలని అందులో కోరింది.
శ్రేయ లేఖను అందుకున్న ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిడ్జ్‌కర్.. బాల కార్మికుల చట్టానికి సవరణ చేశారు. ఈ చట్టం ప్రకారం.. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా బాల్యంలో తాము ఇన్‌ఫ్లూయెన్సర్‌లా ఉన్నామని.. కానీ తమకు రావాల్సిన మొత్తం రాలేదని తల్లిదండ్రులపై కేసు పెట్టొచ్చు. అంతే కాకుండా జులై 1, 2024 నుంచి ఇలాంటి వీడియోల ద్వారా వచ్చిన మొత్తంలో 50 శాతాన్ని ట్రస్ట్ ఫండ్ కింద తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఒక వీడియో చిన్నారులు 50 శాతం సమయం కనిపిస్తే.. వారికి మొత్తం రాబడిలో 25 శాతం.. ఒక వేళ వీడియోలో పూర్తి సమయం కనిపిస్తే 50 శాతం రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో ఛానల్ పోస్ట్ అయిన 30 శాతం వీడియోల్లో కనిపిస్తేనే ఏ చిన్నారిని అయినా ఈ చట్టం మైనర్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లా గుర్తిస్తుంది. ఈ చట్టం ద్వారా తల్లిదండ్రుల డబ్బు ఆశకు, ప్రచార కాంక్షకు బలవుతున్న చిన్నారులకు రక్షణ కల్పించినట్లు అవుతుందని పార్టీలకతీతంగా ఇల్లినాయిస్ చట్టసభ వ్యాఖ్యానించింది.