- తెలంగాణవాదం, సామ్యవాదం, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, రాజ్యాంగబద్ధ పంథా, శాంతియుత కార్యాచరణ
- ఇవే గీటురాళ్లుగా ప్రగతిశీల శక్తుల సమీకరణ
- చొరవ చూపుతున్న పీడీఎస్‌యూ పాత తరం
- కమిటీ కన్వీనర్‌గా ఆర్ గురువా రెడ్డి
- కో కన్వీనర్‌గా ప్రాఫెసర్ కొండా నాగేశ్వర్
సమాజ అవసరాలను తీర్చడానికి కొత్త శక్తులు పుట్టుకు రావడాన్ని చరిత్రలో ఎన్నో సందర్భాలలో చూశాం. తెలంగాణలో ఇప్పుడు అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో వామపక్ష భావజాలం గల వారిని ఏక తాటి పైకి తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. తద్వారా అన్ని వర్గాల వామపక్షాల వారు, ప్రజాస్వామిక భావజాలం గల వారు బలోపేతమైన శక్తిగా అవతరించే పరిస్థితి కనిపిస్తున్నది.
విధాత: ఒకప్పుడు వామపక్షాలు (Leftists) తెలంగాణలోనే కాదు, దేశమంతటా బలంగా ఉండేవి. ఇప్పుడవి నామమాత్రంగా మారిపోవడం వామపక్ష అభిమానులను కలిచివేస్తున్నది. ఈ లోటును భర్తీ చేయడానికి వామపక్ష పూర్వ విద్యార్థుల నుంచి ప్రయత్నం మొదలైంది. 1970 దశకం తరువాత CPI, CPM అనుబంధ విద్యార్థి సంఘాలు బలహీనపడసాగాయి. ఈ మితవాద విద్యార్థి సంఘాల స్థానాన్ని అతివాద సంఘాలు ఆక్రమించాయి. పీడీఎస్‌యూ (PDSU) ఇందుకు ఉదాహరణ.
ఈ అతివాద వామపక్ష సంఘాల విద్యార్థులు ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి వచ్చిన యువత ఉన్నప్పటికీ, ఈ విద్యార్థి సంఘాల మాతృ సంస్థల కార్యాచరణ లోపం వల్ల బలపడలేక పోయాయి. త్యాగాలు ఘనం ఫలితం శూన్యం ఎందుకయిందనేది వేరే చర్చ. అయితే సిద్ధాంత నిబద్ధతతో, త్యాగాలకు సిద్ధపడి వచ్చిన యువత మాతృ సంస్థల వైఖరి మూలంగా క్రమంగా ఉద్యమాలకు దూరమై తమకు తోచిన వృత్తులలో స్థిరపడ్డారు.
కొందరు రాజకీయ పార్టీలలో చేరి కీలక స్థానాలకు చేరుకున్నారు. మరికొందరు అధ్యాపక తదితర వృత్తులలో చేరి, సామాజిక స్పృహను కోల్పోకుండా తోచిన రీతిలో సమాజ శ్రేయస్సుకు ఏదో రీతిలో పాటుపడుతున్నారు. వామపక్ష వృత్తి సంఘాలలో చేరినప్పటికీ వారిలో ఇంకా ఏదో చేయాలనే తపన రగులుతున్నది. వామపక్ష సంస్థల వారికి తగిన దిశానిర్దేశం, కార్యాచరణ లేకపోవడమే ఇందుకు కారణం. ఒకప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలలో పనిచేసిన వారు ఇప్పుడు తెలంగాణ సమాజమంతా విస్తరించి ఉన్నారనేది వాస్తవం.
పీడీఎస్‌యూ పాతతరంలో ఆలోచన
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనించిన పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులకు కొందరికి తాము మళ్ళీ సమాజంలో చురుకైన పాత్ర వహించాలని, సమష్టి శక్తితో ముందుకు పోవాలనే ఆలోచన మొలకెత్తింది. ఈ మేరకు వారిలో చర్చలు మొదలయ్యాయి. ఒకప్పుడు పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆర్. గురువా రెడ్డి, కన్వీనర్‌గా, ప్రాఫెసర్ కొండా నాగేశ్వర్ కో కన్వీనర్‌గా – పూర్వ విద్యార్థులను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో- ఒక కమిటీ ఏర్పడ్డది. హిందుత్వ ఫాసిస్టు దాడిని, విద్య కాషాయీకరణను, కార్పొటీకరణను ప్రతిఘటిస్తూ పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులంతా ఏకం కావాలని కమిటీ పిలుపునిచ్చింది.
వివిధ స్థాయిల్లో నాయకత్వం బాధ్యులుగా వ్యవహరించిన పీడీఎస్‌యూ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించింది. చీలికలుగా ఉన్న అన్ని వర్గాల వారు విభేదాలను అధిగమించి ఏకం కావాలనే సందేశాన్ని అందించింది. తెలంగాణవాదం, సామ్యవాదం, సామాజిక న్యాయం, సామ్రాజ్యవాద వ్యతిరేకత, రాజ్యాంగబద్ధ పంథా , శాంతియుత కార్యాచరణ ప్రధానాంశాలుగా వీరు చేపట్టినట్టు తెలుస్తున్నది. మాతృ సంస్థల ఆలోచనా విధానం, కార్యాచరణతో నిమిత్తం లేకుండా పూర్వ విద్యార్థులంతా ఏకంగా తమదైన ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలనే ధోరణి వీరిలో కనిపిస్తున్నది.
విశ్వాసం కల్పించిన జనవరి సమ్మేళనం
జనవరి 21వ తేదీన ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్‌భవన్‌లో జరిగినప్పుడు దాదాపు ఎనిమిది వందల మంది రావడం నిర్వాహకులను ఆశ్చర్య పరిచింది. 50, 60 ఏళ్ళ వయసు వారు కూడా ఉత్సాహంగా కనిపించారు. వీరంతా ఇప్పుడు వివిధ రంగాల్లో ఉన్నారు. ఈ సమ్మేళనం అందించిన స్ఫూర్తితో జిల్లా సమావేశాలు మొదలయ్యాయి. ఏప్రిల్ 14న జార్జిరెడ్డి వర్ధంతి జరప తలపెట్టారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం మరొకటి జరపాలనే ఒత్తిడి వచ్చిందనీ, ఈలోగా జార్జి వర్ధంతి కూడా కలిసి వచ్చిందని నిర్వహకులు తెలిపారు.
ఇతర విద్యార్థి సంఘాల పాత నేతల్లోనూ ఆసక్తి
పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని సమావేశం నిర్వహించినప్పటికీ ఒకప్పుడు విద్యార్థి రాజకీయాలలో పనిచేసిన ఇతర సంఘాల వారు కూడా వచ్చి చేరుతున్నారు. మేం చాలా ఇంక్లూజివ్‌గా ఉంటున్నాం. వామ పక్ష భావ జాలం గల వారందరికీ ఒక వేదిక ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అని గురువారెడ్డి అన్నారు. ఆర్‌ఎస్‌యూ, డీఎస్‌వో వంటి సంస్థలలో పనిచేసిన పూర్వ విద్యార్థులు కూడా కొందరు తమను కలిసి మాట్లాడారని ఆయన తెలిపారు. మాతృ సంస్థల చీలికలు, అందుకు వారు చెబుతున్న కారణాలతో అభిమానులు విసిగి పోయి ఉన్నారు. సమాజం విషమ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈ చీలికలతో బలహీనపడటం ఏమిటి అనేది అభిమానులను ఆవేదనకు గురి చేస్తున్నది. ఈ బాధనే పూర్వ విద్యార్థులందరినీ ఉమ్మడి వేదిక మీదికి రావడానికి పురికొల్పింది.
మితవాద లెఫ్టిస్టులూ ‘మేము సైతం’
మితవాద వామపక్షాల అభిమానులు కూడా ఈ కమిటీ వైపు ఆసక్తిగా చూడటానికి కారణం ఉన్నది. సీపీఐ, సీపీఎం నాయకులు ఇష్టారీతిన అధికార పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం పట్ల కార్యకర్తలు ఆగ్రహంతో వేగిపోతున్నారు. ఇటీవల వామపక్షాలు బీఆర్‌ఎస్‌తో పొత్తుకు దిగడం పట్ల కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. వామపక్షాలు తమదైన కార్యాచరణతో బలంగా ముందుకు సాగే క్రమంలో ఆయా పొత్తులు పెట్టుకోవడం వేరు. కానీ కార్యచరణను మరిచి, బలహీనపడి, అధికారం కోసం అర్రులు చాచే పార్టీలతో అంటకాగడమేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం తరువాత పార్టీ నాయకులకు మళ్ళీ తీవ్ర ప్రతిఘటన ఎదురవడం ఇదే మొదటిసారి. ఈ రెండు వామపక్షాల కార్యకర్తలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న దశలో పూర్వ విద్యార్థుల నమ్మేళనం జరిగింది. దీంతో ఈ పరిణామాల పట్ల ఆసక్తిగా చూస్తున్నారు. వామపక్షాలు బలహీనపడ్డాయి. మరోవైపు తెలంగాణ రాజకీయ రంగంలో శూన్యత ఏర్పడ్డది. దీంతో కొత్త రాజకీయ పక్ష అవసరం ఏర్పడ్డదని ప్రాఫెసర్ కొండా నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. రాజకీయ పక్షం ఏర్పాటు చేయాలని చాలా మంది కార్యకర్తలు, అభిమానులు కోరుతున్నారు. కానీ నిర్వాహకులు మాత్రం ఆచితూచి వ్యవహరించే ధోరణితో ఉన్నట్టు కనిపిస్తున్నది.
కీలక సమయంలో బలహీనంగా వామపక్షాలు
‘ప్రపంచీకరణ’ పేరుతో సామ్రాజ్యవాదం ప్రవేశించింది. విదేశీ కార్పొరేట్ల మద్దతుతో ఫాసిస్టు శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ, ఇటువంటి విషమ పరిస్థితుల్లో వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే సంస్థలు బలహీనంగా ఉన్నాయి. పలు సామాజిక సమస్యలకు వామపక్ష దృక్కోణం గలవారు విశ్లేషించి పరిష్కారం సూచించగలరు. ఇది వామపక్ష భావజాలానికి ఉన్న విశిష్టత.
వామపక్ష భావజాలం బలహీనపడటం వల్ల రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలను అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, తదనుగుణంగా ప్రజలకు మార్గదర్శనం చేయడం జరగడం లేదు. ఫాసిస్టుల ప్రజా వ్యతిరేక భావజాలం విస్తృతంగా ప్రచారమవుతున్నది. కుహనా మేధావులు పుట్టుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలలో పనిచేయవలసిన వామపక్ష సంస్థ అవసరం మునుపటి కన్నా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడున్న రాజకీయ పక్షాలు ఈ పని చేయకపోగా, వీటి నాయకులు అధికార కేంద్రం చుట్టూ తిరుగుతూ తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటున్నారనే విమర్శ ఉన్నది.
ఈ క్రమంలో వామపక్షాలు ప్రజలకు దూరమయ్యాయి. వారి కార్యకర్తలే వీట ధోరణలను ఆమోదించడం లేదు. వామపక్షాల బలం ఎంత ఉన్నా, ప్రజలలో వీరికి నైతిక బలం ఉండేది. వీరు ఏమంటారో అని ప్రత్యర్థులు కూడా దడుచుకునే వారు. కానీ వీరి ప్రభావం సన్నగిల్లడంతో అభిమానులు కొత్త వామపక్ష కేంద్రం నెలకొల్పాలని , వీలైతే రాజకీయ పక్షమే ఏర్పడాలని కోరుకుంటున్నారు.
సైద్ధాంతిక మార్గదర్శనం అవసరం
అధ్యాపక తదితర రంగాలలో ఉన్న వామపక్షపూర్వ విద్యార్థులు చాలా మంది మాకు సైద్ధాంతిక మార్గదర్శకత్వం అందించే, కార్యాచరణను సూచించే , మా శక్తియుక్తులను సమాజానికి ఉపయోగించు కోనిచ్చే మాతృసంస్థ ఒకటి ఉండాలని అంటున్నారు. మాతృ సంస్థ అనగానే తమను వారి అవసరాల కోసం వాడుకునే అనుబంధ సంఘాలపై పెత్తనం చెలాయించే నేటి రాజకీయ పక్షాల వంటివి కాదు. ఒక సమన్వయ కేంద్రం ఉంటే చాలునని భావిస్తున్నారు. సమాజంలో పనిచేసే మొత్తం వామపక్ష శక్తులకు కేంద్రకంగా వ్యవహరించే సంస్థ అవసరం ఉంది.
అయితే రాజకీయ పక్షంగా ఏర్పడకూడదని కూడా కాదు. రాజకీయ పక్షం వాస్తవిక దృక్పథంతో వ్యవహరించేదై ఉండాలి అనేది అభిమానుల మనోగతంగా ఉన్నది. గతంలో వామపక్ష పార్టీలు అనేక వృథాగా అనేక త్యాగాలు చేయించడం, సిద్ధాంతాల పేరుతో చీలికలై బలహీనపడటం గమనించిన కార్యకర్తలకు ఇక అటువంటి రాజకీయాలు వద్దు అనే భావం ఏర్పడింది. అయితే ఒక నిజాయితీగల దృఢంగా పనిచేసే రాజకీయ పక్షం ఉండాలనే అభిప్రాయం బలంగా ఉన్నది.
జనబాహుళ్య మద్దతున్న వామపక్షం
వామపక్ష వర్గాలకున్నంత మానవ వనరులు ఏ రాజకీయ పక్షానికీ లేవు. తెలంగాణ అంతటా వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వివిధ రంగాల కార్మికులు- అంకిత భావంతో పనిచేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. గాయకులు, కళాకారుల సంగతి చెప్పనవసరం లేదు. భావజాలం కారణంగా పాత్రికేయ వృత్తిని ఎంచుకున్న పాతతరం నిజాయితీ పరులు కూడా చాలా మందే ఉన్నారు. 1970 దశకం తరువాత కాలంలో ఏఐఎస్‌ఎస్‌లో రిక్రూట్‌మెంట్ నాయకుల నిరాసక్తత కారణంగా నిలిచిపోయింది.
కానీ ఈ సంస్థ పాతతరం మేధావులు, అభిమానులు చాలా మంది నిజాయితీగా నిబద్ధతతో ఉన్నారు. ఆర్థిక రంగంలో, అంతర్జాతీయ రంగంలో, సాహితీ రంగంలో వీరు ఉద్ధండులు. ఆరువై డెబ్బయి ఏండ్లు పైబడిన వారు కూడా వినే వారుంటే చెప్పడానికి సిద్ధమన్నట్టుగా ఉన్నారు. వీరి మేధో శక్తిని ఆయా పార్టీలు ఉపయోగించుకోవడం లేదు. గతంలో వామపక్షాల నుంచి ఎన్నో గొప్ప పుస్తకాలు వచ్చాయి.
ఎన్నో ఉత్తమమైన రచనలు, అనువాదాలు రావడానికి ఈ పాతతరం మేధావి వర్గమే కారణం. వీరి రచనల కారణంగా సమాజంతో ఎంతో ఎన్‌రిచ్ అయింది. ఆ తరువాత కాలంలో అతివాద వామపక్ష పంథాలకు చెందిన మేధావులు కూడా ఎంతో మంది వచ్చారు. వారి ఆధ్యర్వంలో సాగిన సాహిత్య సృష్టి తక్కువేమీ కాదు. వీరిని ఉపయోగించుకుంటే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. కొడిగట్టి పోతున్న దీపాన్ని అరచేతుల మధ్య కాపాడుకున్నట్టు అవుతుంది.
కలిసొచ్చేందుకు ఎందరో సిద్ధం.. కలిపేవారే కావాలి
‘తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొరియర్‌గా కీలక పాత్ర పోషించాను. ఉపాధ్యాయ సంఘ ఉద్యమాలలో పాల్గొన్నా. రిటైర్ అయి పదిహేనేండ్లు దాటింది. పింఛన్‌తో బతుకుతున్నా. నాకు ఏ లోటు లేదు. ఎంతో అధ్యయనం, అనుభవం ఉన్నది. సమాజంలో ఎంతో గౌరవం ఉన్నది. ఏ పదవీ బాధ్యతలు లేకుండా నన్ను సిద్ధాంత ప్రచారం కోసం ఉపయోగించుకుంటే ఇంకా ఏదో రూపంలో సేవ చేద్దును. అదే బాధగా ఉంది’ అని కరీంనగర్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు మరణించడానికి కొద్ది రోజుల ముందు కొందరు తెలంగాణ వాదులతో అన్నాడు.
‘నేను సైన్స్ ఉపాధ్యాయుడిగా శాస్త్రీయ ఆలోచనా విధానం కోసం పనిచేస్తున్నా. ఒకప్పుడు నేను పనిచేసిన వామ పక్ష వర్గంతో సంబంధం లేకుండా ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. పంథాలతో నిమిత్తం లేకుండా ప్రజాస్వామ్య బద్ధంగా అందరికీ ఆమోదయోగ్యమైన కార్యక్రమం ఎవరు అప్పగించినా కలిసిరావడానికి సిద్ధం’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు అన్నాడు.
‘మాది కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ కుటుంబం. మా కుటుంబం దృష్టిలో నెహ్రూ సామ్యవాది. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ . ఇందిరా గాంధీపై అదే అభిమానం కొనసాగింది. అయినా మాకు సోవియెట్ యూనియన్ అంటే అభిమానం. మేం సోవియెట్ పత్రికలు, పుస్తకాలు చదివేవారం. సోవియట్ యూనియన్ కూలి పోయినప్పుడు బాధ పడ్డాం. ఇప్పుడు ఏదైనా నిజాయితీగల వామపక్ష పార్టీ ఏర్పడితే మా సంఘీభావం తప్పకుండా ఉంటుంది’ అని హైదరాబాద్‌లో స్థిరపడిన ఒక రిటైర్డ్ ఉద్యోగి అన్నాడు. వామపక్ష శిబిరంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అభిమానులూ పార్టీలకు అతీతంగా విస్తృతంగా ఉన్నారు. కానీ ఉపయోగించుకునే వామపక్ష సంస్థ లేదు.
లాటిన్, యూరోపియన్ లెఫ్ట్ రాజకీయాలే ప్రేరణ
రాష్ట్రంలో వామపక్ష రాజకీయాలకు సంబంధించి శూన్యం ఆవరించి ఉన్నది. ఈ శూన్యాన్ని భర్తీ చేస్తే ప్రజలు ఆదరిస్తారు. బిహార్‌లో ఒక వామపక్షానికి 12 అసెంబ్లీ సీట్లు ఈ కాలంలో రావడం విశేషం. సీపీఐ ఎంఎల్ వర్గం అనగానే సాయుధ పోరాటం అనుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా పరివర్తన తేవచ్చు. ప్రజలలో పనిచేస్తే బిహార్‌లో మాదిరిగా బలమైన రాజకీయ పక్షంగా ఎదగవచ్చు.
తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పక్షం అవసరం కూడా ఉన్నది. వామపక్షాలకు, బలహీనవర్గాలకు చెందిన మేధావులు, కార్యకర్తలు ఇటువంటి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. యురోపియన్ సోషల్ డెమొక్రాటిక్ పార్టీల తరహాలో లెఫ్ట్ ఆఫ్ ది సెంటర్ పాలిటిక్స్ ఇప్పటి అవసరం. లాటిన్ లెఫ్ట్ ప్రయోగాలు కూడా తెలంగాణ వామపక్ష అభిమానులకు ప్రేరణ ఇస్తున్నాయి.
ప్రజలు చూపేదే కొత్త వామపక్షం బాట
రాజకీయ పక్షం ఏర్పాటు, నిర్వహణ అంత సులభం కాదు. రాజకీయ పక్షం అనగానే ఎన్నికలు అనే అభిప్రాయం బలంగా ఉన్నది. ఎన్నికలు ప్రధానం కాదంటే, సాయుధ పోరాటం అని భావిస్తారు. ఇదీ వచ్చిన సమస్య. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అనుకూలమా వ్యతిరేకమా అనేది మొదటగా ఎదురయ్యే ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు, చర్చలతో కాలక్షేపం చేయడం వామపక్షాలకు అలవాటుగా మారింది.
ఏ రాజకీయ పక్షానికో అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వామపక్షాలు పుట్టడం పనిచేయడం జరగదు. సిద్ధాంత బలంతో, స్పష్టమైన లక్ష్యంతో, వాస్తవికమైన కార్యాచరణను ఎంచుకుని ప్రజలలో పనిచేయాలి. ఆ క్రమంలో వారికి పరిస్థితులే దారి చూపుతాయి. ప్రజల ఆకాంక్షలు, చైతన్యానికి అనుగుణంగా కర్తవ్య నిర్దేశం జరుగుతుంది. కానీ వామపక్షాలు సిద్ధాంతం, కార్యాచరణ విస్మరించి అధికారపక్షాల చుట్టూ తిరుగుతూ బలహీనపడ్డాయి.
తెలంగాణ లెఫ్టిస్టుల్లో శూన్యత
తెలంగాణలో వామపక్ష రాజకీయాలలో శూన్యం ఆవరించి ఉండటం వల్లనే అభిమానుల నుంచి కొత్త రాజకీయ పక్షం ఏర్పాటు చేయాలనే ఒత్తిడి వస్తున్నది. రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని దాటవేయలేని పరిస్థితి ఏర్పడవచ్చునని నిర్వాహకులకు కూడా అర్థమైంది. అయితే సవాలక్ష చీలిక సంఘాలలో ఇదొకటి కాకుండా సమైక్యతను సాధించేదిగా ఉండాలి.
ఇది ఇప్పుడున్న ఏ రాజకీయ పక్షానికి పోటీగానో, వ్యతిరేకంగానో ఏర్పాడేది కాదు. తమ లక్ష్యానికి అనుగుణంగా చారిత్రక అవసరాన్ని తీర్చడానికి, శూన్యాన్ని భర్తీ చేయడానికి, ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి ఏర్పడేది అయి ఉండాలి. మరీ కరడుగట్టిన సిద్ధాంత పరిమితులు పెట్టుకోకుండా, లిబరల్‌గా, విస్తృతంగా ప్రజాస్వామిక వాదులందరినీ కలుపుక పోవాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది.
సందర్భానుకూలంగా పీడీఎస్‌యూ పూర్వ నేతల ప్రయత్నం
గత అనుభవాల దృష్ట్యా, సాధ్యం కాని లక్ష్యాలను నిర్దేశించుకోకూడదు. కార్యకర్తలను మభ్యపెట్టకూడదు. వారి శక్తియుక్తులను ఉద్యమాల పేరుతో వృథా చేయకుండా, నిర్మాణాత్మకంగా సమాజ హితం కోసం ఉపయోగించాలి. పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు తలపెట్టిన ప్రయోగం సందర్భానుకూలంగా ఉన్నది.
అధ్యాపకులు, ఉద్యోగులు, కార్మికులు, కార్యకర్తల నుంచి అనుకూల స్పందనే వస్తున్నది. కానీ అసలు కార్యక్రమమంతా ఇంకా ముందే ఉన్నది. ఒకప్పుడు మితవాద, అతివాద రాజకీయాలలో ఉన్న మేధావులు, ఉపాధ్యాయులు, వివిధ వృత్తి సంఘాలవారు ఎవరికి వారు సమావేశమై ఈ కొత్త పరిణామంపై చర్చించుకోవాలి. సమైక్య కార్యాచరణ అందరి బాధ్యత అని గుర్తించాలి. – బన్సీధర్