Round Table Meeting | ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి.. వామపక్షాల డిమాండ్

ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను అలాగే మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు. అడవులు, ఖనిజ సంపదలను సహజ వనరులను కార్పొరేటు కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రంలోని మోదీ, అమిత్ షా లు తమ విధానాలను బాహాటంగా అమలు చేస్తున్నారు.

విధాత, హైదరాబాద్ :
ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను అలాగే మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లు. అడవులు, ఖనిజ సంపదలను సహజ వనరులను కార్పొరేటు కంపెనీలకు కట్టబెడుతూ కేంద్రంలోని మోదీ, అమిత్ షా లు తమ విధానాలను బాహాటంగా అమలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ గురువారం హిమాయత్ నగర్ లోని మగ్దూం భవన్లో వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు తీర్మాణాలను ఆమోదించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు అధ్యక్షత వహించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాం, జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని రాజ్యాంగం అమలు కావడం లేదని ప్రశ్నించిన ప్రజలను, కార్మికులను, కర్షకులను, కూలీలను, నిరుద్యోగులను, ఉద్యోగులను, కవులను, కళాకారులను ఉక్కుపాదంతో తొక్కి పెడుతున్నారని విమర్శించారు. స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, లౌకికత్వం వంటి వాటిని మనువాద ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వం కనిపించకుండా చేస్తుందని వాళ్లు ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదివాసులు జీవించే హక్కును కాపాడాలని జల్.. జంగిల్.. జమీన్ నినాదంలో భాగంగా అడవులను అటవీ సంపదలను స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు కారు చౌకగా అమ్మడాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

అనంతరం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు బీ.భాస్కర్ మాట్లాడుతూ, బ్రిటిష్ వాళ్ళు బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు, ఆజాద్, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి ఎంతోమందిని కాల్చి చంపారన్నారు. నేడు స్వదేశీ పాలనలో సైతం కార్పొరేట్ వలస దోపిడీలో భాగంగా ఈ దేశ పౌరులను వేలాది మందిని మనువాద బ్రాహ్మణీయ ఫాసిస్టులు మోదీ, షాలు చంపి వేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్యలను ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు ఉద్యమకారులు విప్లవకారులు రాజకీయ పార్టీలు కవులు కళాకారులు ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్‌ను ఆపివేయాలన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులను చంపడాన్ని ఆపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గ్రేటర్ కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను నిరసిస్తూ శుక్రవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని.. అలాగే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కూనంనేని సాంబశివరావు రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు.

Latest News