విధాత, వరంగల్:
మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లిందని వాటిలో ప్రధానంగా బీమదేవరపల్లి మండలంలో తీవ్ర పంట నష్టం, ఆస్తి నష్టం, రోడ్లు దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులందరికి నష్ట పరిహారం చెల్లించాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు. మొంథా తుపాను ప్రభావం కారణంగా అత్యంత భారీ వర్షాల వల్ల కొత్తపల్లి వరద ప్రభావంతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా కాకుండా రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంట పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని, ప్రభుత్వం ఎకరాకు రూ. 10 వేల ప్రకటించిందని, ఆ పంట నష్టం ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. పశు సంపద నష్టపోయిన వారికి కూడా పరిహారం ఇవ్వాలని, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, దెబ్బతిన్న దేవాదుల ప్రాజెక్టు తరిగతిన పూర్తి చేసి పంటలకు సాగు నీరు అందించాలన్నారు.
దేశానికి కేరళ ఆదర్శం
పేదరిక నిర్మూలనలో కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదర్శమని చాడ అన్నారు. కమ్యూనిస్టు పాలన ఉంటే ఏమిటో కేరళ ప్రభుత్వం చూపించి, నిరూపించిందని, కేరళలో పేదరిక నిర్మూలనకు కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అమోగమని, విద్య, వైద్య రంగంలోనే కాకుండా సుపరిపాలనలో కేరళ దేశంలో ముందంజలో ఉందని చాడ తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, ఎన్ ఎ స్టాలిన్, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొగల రామచంద్ర రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి అదరి రమేష్, నాయకులు చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
