సిమ్‌కార్డ్‌ రూల్స్‌ మారాయ్‌..! అవేంటో తెలుసుకుందామా..?

కేంద్ర ప్రభుత్వం సిమ్‌కార్డు రూల్స్‌ను మార్చింది. కొత్త సిమ్‌కార్డుల అమ్మకం, వినియోగదారులకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించగా.. డిసెంబర్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి

  • Publish Date - December 2, 2023 / 06:38 AM IST

విధాత‌: కేంద్ర ప్రభుత్వం సిమ్‌కార్డు రూల్స్‌ను మార్చింది. కొత్త సిమ్‌కార్డుల అమ్మకం, వినియోగదారులకు సంబంధించి కొత్త నిబంధనలను రూపొందించగా.. డిసెంబర్‌ ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. నిబంధనల మేరకు పీఓఎస్‌ ఏజెంట్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పకుండా నిరోధించేందుకు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌, లైసెన్స్‌దారుతో ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఏదైనా చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడినట్లు తేలితే ఏజెంట్లకు రూ.10లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేశారు.


అలాగే, కొత్త సిమ్‌కార్డ్‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఉన్న నంబర్‌లో కొత్త సిమ్‌ కోసం దరఖాస్తు చేసేందుకు వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. సిమ్ కార్డు తీసుకున్న వ్యక్తికి చెందిన ఆధార్ కార్డ్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. వివరాలను సేకరిస్తారు. ముఖ్యంగా ఒక మొబైల్‌ నంబర్‌ను డిస్‌ కనెక్ట్‌ చేసిన 90 రోజుల తర్వాత మాత్రమే కొత్త కస్టమర్‌కు నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. సిమ్‌ రీప్లేస్‌మెంట్‌ కోసం సబ్‌స్క్రైబర్ మొత్తం కేవైసీ ప్రక్రియను మళ్లీ చేయాల్సి ఉంటుంది.


కొత్త సిమ్‌ యాక్టివేట్‌ అయ్యాక 24 గంటల పాటు ఇన్‌కమింగ్‌, అవుట్‌ గోయింగ్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం అందుబాటులో ఉండవు. మరో వైపు బల్క్‌ సిమ్‌కార్డుల విక్రయాలను కేంద్రం నిషేధించింది. ఒకే ఐడీపై గరిష్ఠంగా తొమ్మిది సిమ్‌కార్డులను కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే, వ్యాపార, వాణిజ్య, కార్పొరేట్‌లకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చింది. సంస్థలు పెద్ద సంఖ్యలో సిమ్‌కార్డులను కొనుగోలు చేసి ఉద్యోగులకు కేటాయించినప్పుడు.. ఆయా సంస్థలు తప్పనిసరిగా కేవైసీ వివరాలను సేకరించాల్సిందేనని నిబంధనల్లో కేంద్రం స్పష్టం చేసింది.

Latest News