Site icon vidhaatha

SIM Card Rules | కొత్తగా ఏఐ ఫీచర్‌ తెచ్చిన ట్రాయ్‌.. ఇకపై అలా చేస్తే రెండేళ్లు సిమ్‌కార్డ్‌ బ్లాక్‌..!

SIM Card Rules | జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు రూల్స్ మారుతూనే ఉంటాయి. కంపెనీ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసిన సమయంలో మారుతుంటాయి. తాజాగా మరోసారి నిబంధనలు మారబోతున్నాయి. దీనికి కారణం ట్రాయ్‌ ఆదేశాలే. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇటీవల పెద్ద ఎత్తున స్పామ్‌ కాల్స్‌, ఫేక్‌ కాల్స్‌ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటికి అడ్డుకట్ట వేయాలని ట్రాయ్‌ నిర్ణయించింది. ఇది టెలికం యూజర్లకు భారీ ఊరట కలుగనున్నది. మారనున్న రూల్స్‌ సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఆ నిబంధనలేంటో తెలుసుకుందాం..!

ఏఐ ఫీచర్‌ని తెచ్చిన ట్రాయ్‌

ఫేక్‌, స్పామ్‌ కాల్స్‌ను గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు ట్రాయ్‌ ఏఐ ఫీచర్‌ని విడుదల చేసింది. ఏ టెలికం సంస్థ నుంచైతే ఫేక్‌, స్పామ్‌ కాల్స్‌ వస్తాయో దానికి అదే సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని ట్రాయ్‌ పేర్కొంది. ఉదాహరణకు స్కామర్స్‌ జియో నంబర్‌ని ఉపయోగించి కాల్స్‌ చేసిన సందర్భాల్లో దానికి జియో కంపెనియే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందులో కంపెనీ బాధ్యత ఏంటంటే.. ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే, వెంటనే దానిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టెలికాం కంపెనీపై ఉంటుంది. అంతటితో ఆగకుండా.. కాల్‌ చేసిన సమయంలో ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా దాన్ని ఫేక్‌ కేటగిరిలో ఉంచాలని పేర్కొంది. తప్పుడు సమాచారం ఇస్తే టెలికం రూల్స్‌ని ఉల్లంఘించినట్లే పరిగణిస్తారు. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించే పనిలో ఉండాలని కంపెనీలకు ట్రాయ్‌ సూచించింది.

రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో..

ఒక వ్యక్తి నెంబర్‌ని తీసుకొని దాన్ని టెలిమార్కెటింగ్‌ కోసం వినియోగిస్తే నంబర్‌ను బ్లాక్‌ చేయనున్నారు. ఆ మొబైల్‌ నంబర్‌ను రెండేళ్ల వరకు బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచనున్నారు. స్పామ్‌, ఫేక్‌ కాల్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో వాటికి చెక్‌ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేసినట్లు ట్రాయ్‌ పేర్కొంది. అయితే, కొందరు ప్రైవేటు నంబర్‌ని ఉపయోగించి ప్రమోషనల్‌ కాల్స్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ట్రాయ్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోనున్నది. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు సైతం ట్రాయ్‌ కఠిన నిర్ణయం తీసుకున్నది. కొత్త సిమ్‌కార్డులు జారీ చేసింది ఈ-వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. సిమ్‌ తీసుకునే ముందు తప్పనిసరిగా ఈ-వెరిఫికేషన్‌ తప్పనిసరిగా చేయాల్పి ఉంటుంది. ఫేక్, స్పామ్ కాల్స్‌ను అరికట్టాలనే లక్ష్యంతో కూడా ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నది.

Exit mobile version