ఆ ఒక్క ఐడియా.. న‌డి సంద్రంలో స‌మాధి కాకుండా కాపాడింది…

ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైనా కొంద‌రు త‌మ బుద్ధి బ‌లాన్ని ఉప‌యోగించి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తారు.

  • Publish Date - January 6, 2024 / 09:11 AM IST

విధాత‌: ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదురైనా కొంద‌రు త‌మ బుద్ధి బ‌లాన్ని ఉప‌యోగించి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌తారు. వారికి ప్ర‌కృతి నుంచి సాయం ల‌భించి మ‌ర‌ణాన్ని త‌ప్పించుకుంటారు. దీనికి తాజా ఉదాహ‌ర‌ణ‌గా నిలిచే ఘ‌ట‌న ఒక‌టి న్యూజిలాండ్‌ (New Zealand) లో జ‌రిగింది. దేశానికి చెందిన నార్త్ ఐలాండ్‌లో చేప‌లు ప‌ట్ట‌డానికి విల్ ఫ్రాన్సెన్ (Miraculous Survival) అనే వ్య‌క్తి సాధార‌ణ ప‌డ‌వ‌ను వేసుకుని స‌ముద్రంలోకి వెళ్లాడు. కాసేప‌టికి మార్లిన్ అనే ఒక చేప‌ను ప‌ట్టుకోవ‌డానికి లైఫ్ జాకెట్ వేసుకోకుండా స‌ముద్రంలోకి దూకాడు. ఈ క్ర‌మంలో త‌న‌కు తెలియ‌కుండానే ప‌డ‌వ నుంచి దూర‌మైపోయాడు. ఆ ప‌డ‌వ కూడా స‌ముద్ర తాకిడికి ఎక్క‌డికో కొట్టుకుపోయింది.


ఈ ప‌రిస్థితుల్లో అత‌డు సుమారు 23 గంట‌ల పాటు త‌న ప్రాణం కోసం పోరాడాడు. అదృష్ట‌వ‌శాత్తు తీరం వైపు వెళ్లే ఒర‌వ‌డిలో చేర‌డంతో.. ఈత కొడుతూ తీరం వైపు ప్ర‌యాణించాడు. క్ర‌మంగా ప్రాణాల‌పై ఆశ కోల్పోతున్న స‌మ‌యంలో అత‌డికి ఒక ఆలోచ‌న త‌ట్టింది. చిన్న‌పుడు అద్దం మీద సూర్యుని కాంతి ప‌డేలా చేసి దాన్ని పరావ‌ర్తనం చెందించే ప్ర‌యోగం గుర్తొచ్చింది. వెంట‌నే త‌న చేతికున్న వాచ్‌ను తీసి సూర్యుని కాంతి ప‌రావ‌ర్తనం చెందేలా చేశాడు.


దీనిని గుర్తించిన స‌మీప నౌక‌లు అత‌డి వ‌ద్దకొచ్చి ర‌క్షించాయి. ‘నేను బ‌తుకుతాన‌ని అనుకోలేదు. మాములుగా నేను ఆశావాదిని. కానీ ఒకానొక స‌మ‌యంలో దానిని కోల్పోయి ఇక చావు తప్ప‌ద‌నుకున్నా’ అని విల్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఒక స‌మ‌యంలో ఒక షార్క్ త‌న చుట్టూ తిరిగింద‌ని.. దానికి అంత ఆక‌లి లేక‌పోవ‌డంతో వ‌దిలిసి వెళ్లిపోయి ఉంటుంద‌ని గుర్తు చేసుకున్నాడు. తాము కాపాడే స‌మ‌యానికి విల్ చాలా నీర‌సంగా జ‌బ్బు ప‌ట్టిన వాడిలా ఉన్నాడ‌ని రెస్క్యూకు వెళ్లిన జేమ్స్ మెక్‌డోనెల్ తెలిపాడు. ‘ఇది ఒక అద్భుత‌మైన ఘ‌ట‌న‌.


దీనిని ఎవ‌రూ న‌మ్మ‌క‌పోవ‌చ్చు. కానీ దానిని చెప్ప‌డానికి విల్ బ‌తికే ఉన్నాడుగా’ అని చెప్పుకొచ్చాడు. 24 గంట‌ల‌కు పైగా స‌ముద్రంలో ఉండ‌టంతో విల్‌కు విండ్ బ‌ర్న్ స‌మ‌స్య త‌లెత్తింద‌ని వైద్యులు వెల్ల‌డించారు. కీళ్ల నొప్పులు, సీ సిక్నెస్‌కు గురైనా ప్రాణానికి ప్ర‌మాదం లేద‌ని తెలిపారు. అయితే విల్ ప‌డ‌వ ఆచూకీ ఇంకా దొర‌కాల్సి ఉంది. జనవరి 3న జరిగిన ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది.

Latest News