Site icon vidhaatha

NH-65 | అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. రూ.10ల‌క్ష‌ల గంజాయి స్వాధీనం: SP అపూర్వ రావు

NH-65

విధాత: తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిరంతర నిఘాలో భాగంగా మంగళవారం టాస్క్ ఫోర్స్ బృందం కేతపల్లి పోలీసులు ఆరుగురు సభ్యుల గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి 10 లక్షల విలువైన 103 కిలోల 43 ప్యాకెట్లలోని గంజాయిని, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

ఎన్‌హెచ్ 65 లోని కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి కొద్ది దూరంలో బస్సుని ఆపి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా వారి బ్యాగ్ లలో గంజాయిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు.

ఎనిమిది మంది నిందితుల ముఠాలో ఓరిస్సా మల్కాన్ గిరికి చెందిన అశోక్ తారఫ్ దార్, అభిజిత్ తారాఫ్ దార్, ఫణి తారఫ్ దార్, జీవన్ సింగ్ యాదవ్(శాజాపూర్), ధనుంజయ్ విశ్వాస్, శిఖా విశ్వాస్(మహిళా), వినయ్, వివేక్(హైద్రాబాద్) ఉన్నారు. అయితే వారిలో వినయ్, వివేక్ లు పరారీలో ఉండ‌గా, మిగ‌తా ఆరుగురిని ప‌ట్టుకున్నామ‌న్నారు.

నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఒరిస్సా నుండి హైదరాబాద్ కి వెళ్తున్న ప్రయివేట్ బస్సులో మల్కాన్ గిరి నుండి గంజాయిని హైదరాబాద్ కు తరలిస్తున్నారని తేలిందన్నారు. వారు మాల్కన్ గిరి ఒరిస్సా స్టేట్ కి చెందిన గంజాయి వ్యాపారం చేసే వినయ్ ద్వారా గంజాయిని హైద్రాబాద్ లో వినయ్ కి తెలిసిన వివేక్ కు సరఫరా చేసేందుకు వెళ్తున్నామని చెప్పారన్నారు.

ఇందుకు వీరికి ఒక్కొకరికి 10,000 రూపాయలు ఇస్తారని, ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారని ఎస్పీ తెలిపారు. అదే విధంగా జీవన్ సింగ్ కూడా మాల్కన్ గిరి లోనే గంజాయిని కొని, ఇదే బస్సులో గంజాయి ని హైదరాబాద్ కి, అక్కడి నుండి మధ్య ప్రదేశ్ కు తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అక్కడ తెలిసిన వారికి ఎక్కువ లాభానికి అమ్ముకుంటాడన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ఈ కేసు ఛేదించ‌డంలో నల్గొండ డి‌ఎస్‌పి నర్సింహారెడ్డి పర్యవేక్షణలో పనిచేసిన శాలిగౌరారం సి‌ఐ రాఘవ రావు, కేతేపల్లి ఎస్‌ఐ అనిల్ రెడ్డి, సిబ్బంది అంజాద్, నాగేశ్వర రావు, కిశోర్, సురేశ్, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Exit mobile version