తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు విలువ ఇవ్వని, ఆత్మీయత లేని మంత్రికి ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకని విమర్శ .
బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించడానికి కృషి చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందర్నీ కలుపుకొని పోవడానికి బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రజాప్రతినిధులు కార్యకర్తలను మొదలుకొని నాయకుల వరకు అసంతృప్తులను, అందరిని కలుపుకొని పోయి రాబోయే ఎన్నికల్లో గట్టి ఎక్కాలని యోషిస్తున్న తరుణంలో అక్కడక్కడ నిరసన గళాలు వినబడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా గులాబీ బాస్ ఇంచార్జీలను కూడా నియమించారు.
పార్టీ అధినేత ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం అంతటా ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి. ఇంచార్జీలు, ముఖ్యనేతలు కూడా ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొంటూ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనాల సాక్షిగా పార్టీలోని విభేధాలు బగ్గుమంటున్నాయి . అసంతృప్తి బయటపడుతోంది.
తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లక్ష్యంగా ఆ పార్టీకి చెందిన మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు కె. శ్రీహరిరావు ధిక్కార స్వరాన్ని వినిపించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీహరి రావు మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విడుదల చేసిన బహిరంగ లేఖ కలకలాన్ని రేపుతోంది.
ఇంద్రకరణ్ రెడ్డి కార్యకర్తలను నాయకులను పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆత్మీయత లేని సమ్మేళనాలకు అర్థం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అధికారం, అవకాశం ఉన్నా కార్యకర్తలను ఆదుకునే ప్రయత్నం చేయని మంత్రితో ప్రయోజనం ఏంటని నిలదీశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల పాతవారిని కలుపుకొని వెళ్లాలని ఆదేశాలిస్తే సీఎం కేసీఆర్ ఆదేశాలను తుంగలో తొక్కి కేవలం తన అనుచర వర్గానికే మంత్రి వత్తాసు పలకడం అర్థరహితమని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను అమలు చేయని మంత్రి ఇంద్రకరణ్ నాయకత్వంపై ప్రజలు, కార్యకర్తలు నమ్మకం కోల్పోయారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర సాధనకు పోరాడిన ఉద్యమకారులను, పార్టీకోసం కష్టపడ్డ కార్యకర్తలను విస్మరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఇచ్చే పార్టీ పదవులను మంత్రి తన వర్గీయులకు మాత్రమే ఇచ్చారని, ఉద్యమకారులను పక్కనబెట్టారని ఆరోపించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మీయ సభల్లో ఆత్మీయత లేదని, అసలు వాటికి అర్ధమే లేదని విమర్శించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలినట్లైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా కె. శ్రీహరిరావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కేటిఆర్ కి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందారు. అంతేకాకుండా రెండు సార్లు టిఆర్ ఎస్ అభ్యర్థిగా నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నేత నిర్ణయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.