విధాత: తెలంగాణలో కొన్ని గంటల్లో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. ఇక పదవుల పందేరం తెరమీదకి వచ్చింది. కీలక స్థానాల్లో ఎవరు కూర్చుంటారన్న చర్చ ప్రతిచోటా వినపడుతోంది. ఈక్రమంలో కొత్త అడ్వకేట్ జనరల్ నియామకంపై న్యాయవాదుల్లో ఆసక్తి కలుగుతోంది. న్యాయ వ్యవస్థలో ఈ పదవి చాలా కీలకమైంది కావడంతో హైకోర్టు కారిడార్లు, క్యాంటీన్లు, న్యాయవాదుల చాంబర్లలోనే కాదు ప్రభుత్వ వర్గాలు, ప్రజల్లో కూడా చర్చానీయాంశమైంది. న్యాయ కోవిదుడు, ప్రజల మేలు కోరేవాడు ఉండాలన్న ఆకాంక్ష ఒకవైపు.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన న్యాయవాదులందరూ.. ఉద్యమ ఆకాంక్షలు తెలిసినవాడు కావాలని ఆశపడుతున్నారు.
తమతో ఉద్యమంలో ఉన్నవాడు ఆ కుర్చీలో కూర్చోవాలనీ కోరుకుంటున్నారు. వీరందరి దృష్టిని ఆకర్షిస్తూ సుప్రీమ్ కోర్టు సీనియర్ న్యాయవాది పీ నిరూప్ రెడ్డి కొత్త అడ్వకేట్ జనరల్ రేసులో ముందున్నారని తెలుస్తోంది. ఆయన సుప్రీమ్ కోర్టులో మూడు దశాబ్దాలుగా న్యాయవాదిగా తన సేవలు అందిస్తున్నారు. సుప్రీమ్ కోర్టు ఏర్పాటు తర్వాత తెలంగాణ నుండి సీనియర్ న్యాయవాదిగా గుర్తించబడిన మొదటి న్యాయవాదిగా నిరూప్ రెడ్డి గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలోనూ విశేష కృషి చేసారన్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని చెబుతున్నారు.