- సాయన్న అంత్యక్రియలకు అధికార లాంఛనాలేవి?
- శ్మశానం వద్ద అభిమానులు ఆగ్రహం
- సమాధానం చెప్పలేక నిష్క్రమించిన మంత్రులు
విధాత: కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జీ సాయన్న అంతిమ సంస్కారాల్లో అలజడి నెలకొన్నది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని ఆయన కుటుంబీకులు, అభిమానులు శ్మశానం వద్ద ఆందోళనకు దిగారు.
దీంతో శ్మశాన వాటిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చే అధికారం తమకు లేకపోవడంతో వారికి సర్దిచెప్పలేక పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక మంత్రి మల్లారెడ్డి అక్కడి నుంచి నిష్క్రమించారు.
దీంతో సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఈ విషయంలో మరింత సమాచారం అందాల్సి ఉన్నది. సికింద్రాబాద్ లోని మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని అందరూ ఊహించారు.
అందుకు పూర్తి భిన్నంగా ఏర్పాట్లు ఉండడంతో అభిమానులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన సాయన్న అంత్యక్రియలు సాధారణ వ్యక్తిగా నిర్వహిస్తారా అంటూ మంత్రులు శ్రీనివాస్, మల్లారెడ్డిలను నిలదీశారు.
చితిపై ఆయన పార్థివదేహాన్ని దహనం చేయించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. సుమారు గంటన్నరకు పైగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే లేదా పార్లమెంటు సభ్యుడు చనిపోతే అధికార లాంఛనాలతో నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. ప్రభుత్వం ఆ మేరకు ప్రకటన చేస్తుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సచివాలయంలోని సాధారణ పరిపాలన విభాగం (జిఏడి) కుటుంబ సభ్యులను సంప్రదించి ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం అంత్యక్రియలు బన్సిలాల్ పేటలో జరగాల్సి ఉండగా, ఆ తరువాత మారేడ్ పల్లి కి మార్చడంతో ఏర్పాట్లు చేయలేకపోయాని జిఏడి అధికారులు సన్నాయి రాగాలు తీస్తున్నారు.
అయితే.. అభిమానుల ఆగ్రహం నేపథ్యంలో పోలీసులను రప్పించి గౌరవ వందనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉన్నది.