విధాత: ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు చాకిరి చేయించుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్మెంట్ తరువాత వారికి దక్కాల్సిన పెన్షన్ విషయంలో సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరించాయి. ఫలితంగా జీవిత చరమాంకంలో దుర్భర పరిస్థితులను చవిచూడాల్సిన దుస్థితి దాపురించింది.
2004 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్ధు చేసి, నూతన పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే దీనిపై గత దశాబ్ధకాలంగా 2004 తరువాత నియమితులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు.
ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో పలు రాష్ట్రాలు క్రమక్రమంగా ఎత్తేస్తున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది.
దేశంలో 2004 వరకు పాత పెన్షన్ విధానం ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసేవారు. ఈ విధానం మూలంగా బడ్జెట్ పై పెనుభారం పడుతున్నది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం (ఎన్.పి.ఎస్) అమల్లోకి తెచ్చింది. ఈ విధానం మూలంగా ప్రభుత్వాలకు ఆర్థిక భారం తగ్గగా ఉద్యోగులకు ఆర్థిక సమస్యగా పరిణమించింది.
ఎన్.పి.ఎస్ విధానం కింద 50 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 22 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు నియమితులు అయ్యారు. వీరందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలవుతున్నది. రిటైర్మెంట్ అయిన తరువాత తమ భవితవ్యం ఏమిటనే పునరాలోచనలో పడ్డారు.
సుమారు మూడు దశాబ్ధాలకు పైగా ఉద్యోగం చేసి జీవన సంధ్యలో డబ్బుల కోసం వెంపర్లాడాలా అనే బాధ నూతనంగా నియమితులైన ఉద్యోగుల్లో పాతుకు పోయింది. కొత్త విధానం ప్రకారం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జి.పి.ఎఫ్) అమలు చేయరు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం క్రింద ప్రతినెలా కొంత మొత్తాన్ని జీతం నుంచి కోత పెడతారు. రిటైర్మెంట్ తరువాత ప్రతినెలా ఇంత మొత్తం పెన్షన్ లభిస్తుందనే భరోసా ఉండదు. స్టాక్ మార్కెట్ లో లాభాలు, హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతినెలా పెన్షన్ మొత్తం ఇస్తారు.
దేశంలో ఎన్.పి.ఎస్ అమలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ విధి విధానాలను రూపొందించలేదు. విధి విధానాలను రూపొందించకుండా ఉద్యోగులు ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తానికి భరోసా లేకుండా చేశారు. 2004 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఉద్యోగులు చెల్లించారు.
ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టింది. స్టాక్ మార్కెట్ లో లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఆ భారం ఉద్యోగులపైనే పడుతుంది. కరోనా సమయంలో స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా ప్రతి ఉద్యోగి భారీగా నష్టపోయాడు.
ఒకవేళ షేర్ మార్కెట్ ఢమాల్ అంటే ఇప్పటి వరకు పొదుపు చేసిన రూ.8 లక్షల కోట్లు ఆవిరై రూ.4 లక్షల కోట్లకు పడిపోయే ప్రమాదం కూడా ఉంది. నూతన పెన్షన్ పై విధి విధానాలు లేకపోవడంతో ఒక్కో ఉద్యోగికి ప్రతి నెలా రూ.4 వేలకు మించి పెన్షన్ రావడం లేదంటే ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చు.
మొదటి నుంచి వెస్ట్ బెంగాల్ వ్యతిరేకం…
నూతన పెన్షన్ విధానం (ఎన్.పి.ఎస్)ను వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మొదటి నుంచి వ్యతిరేకించడమే కాకుండా అమలు చేయడం లేదు. 2004 నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేయడమే కాకుండా అందుకు తగ్గట్లుగా రిక్రూట్ మెంట్లను చేస్తున్నది. కొత్త పెన్షన్ విధానం అమలు చేసిన రాష్ట్రాలు ఉద్యోగుల ఒత్తిడితో మళ్ళీ పాత విధానం వైపు మళ్ళాయి.
ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రాజస్థాన్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, పంజాబ్ తో పాటు తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపిలో కూడా పాత విధానం అమలు చేస్తామని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల హామీ ఇచ్చారు. అమలు కోసం ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి.
తమ పొట్టగొట్టడం ఎంత వరకు సమంజసం: స్థితప్రజ
దేశ వ్యాప్తంగా గతంలో మాదిరే పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిందేనని నేషనల్ మూవ్ మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జనరల్ సెక్రెటరీ స్థితప్రజ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
న్యాయ వ్యవస్థ, ఆర్మీలో పాత విధానం అమలు చేస్తూ, తమ పొట్టగొట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సి.ఆర్.పి.ఎఫ్ లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద ఉద్యోగులు జమ చేస్తున్న 24 శాతం నిధుల భవితవ్యం గాలిలో దీపంలా ఉంది. ఈ నిధులను స్టాక్ మార్కెట్ కు, కార్పొరేట్లకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 1.75 లక్షల మంది సిపిఎస్ లో ఉన్నారని స్థితప్రజ తెలిపారు.