Cheetah Deaths | కునో జాతీయ పార్కులో మ‌రో చీతా మృతి.. 9కి చేరిన సంఖ్య

Cheetah Deaths కునో పార్క్‌లో ఆడ చిరుత మృతి మార్చి నుంచి ఇది 9వ మరణం భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఆడ చిరుత మరణంతో గడిచిన ఐదు నెలల్లో ఇక్కడ చనిపోయిన చిరుతల సంఖ్య 9కి పెరిగింది. దేశంలో అంతరించిపోయిన చిరుతలను మళ్లీ ఇక్కడ నడయాడేలా చేసేందుకు విదేశాల నుంచి మోదీ ప్రతిష్ఠాత్మకంగా చిరుతలను తెప్పించిన సంగతి తెలిసిందే. అయితే.. ఖండాలు దాటి వచ్చే చిరుతలు […]

  • Publish Date - August 2, 2023 / 11:16 AM IST

Cheetah Deaths

  • కునో పార్క్‌లో ఆడ చిరుత మృతి
  • మార్చి నుంచి ఇది 9వ మరణం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఆడ చిరుత మరణంతో గడిచిన ఐదు నెలల్లో ఇక్కడ చనిపోయిన చిరుతల సంఖ్య 9కి పెరిగింది. దేశంలో అంతరించిపోయిన చిరుతలను మళ్లీ ఇక్కడ నడయాడేలా చేసేందుకు విదేశాల నుంచి మోదీ ప్రతిష్ఠాత్మకంగా చిరుతలను తెప్పించిన సంగతి తెలిసిందే. అయితే.. ఖండాలు దాటి వచ్చే చిరుతలు ఇక్కడి వాతావరణంలో ఇమిడే అంశంపై మొదట్లోనే సందేహాలు తలెత్తాయి.

కానీ.. వాటిని పట్టించుకోని ప్రభుత్వం.. చిరుతలను దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తెప్పించింది. వాటిలో ధాత్రి అనే ఆడ చిరుత బుధవారం ఉదయం విగతజీవిగా పడి ఉండటాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అయితే.. దాని మరణానికి కారణమేంటో ఇంకా తెలియలేదని, చిరుతకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని పార్క్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం కునో నేషనల్‌ పార్క్‌లో ఏడు మగ, ఆరు ఆడ చిరుతలతోపాటు ఒక చిరుత పిల్ల ఉన్నాయని, వాటిని బోనుల్లో ఉంచి సంరక్షిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. ఇవన్నీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయని వెల్లడించారు. ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యాన్ని ఆటవీ వెటర్నరీ వైద్యులతో పాటు.. నమీబియా నుంచి వచ్చిన నిపుణులు పర్యవేక్షస్తున్నారని పేర్కొన్నారు.

రెండు ఆడ చిరుతలను బహిరంగ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టగా.. అందులో ఒకటి తాజాగా మృత్యువాత పడింది. దీంతో ఇప్పటి వరకూ ఇక్కడ చనిపోయిన చిరుతల సంఖ్య 9కి పెరిగింది. చనిపోయిన వాటిలో మూడు చిరుత పిల్లలు కూడా ఉన్నాయి.

గతేడాది సెప్టెంబర్‌లో కునో పార్క్‌కు నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చిరుతలను తెప్పించిన సంగతి తెలిసిందే. అవి మూడు పిల్లలను పెట్టాయి ఆ మూడు చనిపోయాయి. దేశంలోకి చీతాలను మళ్లీ తెచ్చేందుకు ఉద్దేశించిన కార్యక్రమం.. వరుస మరణాలతో ప్రశ్నార్థకంగా మారింది. గత నెలలోనే నాలుగు రోజుల వ్యవధిలో రెండు మగ చీతాలు చనిపోయాయి.

రేడియో కాల‌ర్స్‌ వళ్లేనా..

పులులు, సింహాలు సంచ‌రిస్తున్న స్థాయిలో చీతాలు కూడా వాటి సంత‌తితో స్వేచ్ఛ‌గా తిర‌గాల‌ని ప్రాజెక్టు చీతా ప్ర‌ధాన ఉద్దేశం. ఈ క్ర‌మంలో ఆ చీతాలు భార‌త వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డే వ‌ర‌కు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఈ చీతాల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునేందుకు వాటికి రేడియో కాల‌ర్స్‌ను కూడా అమ‌ర్చారు. ఇంత‌లోనే వ‌రుస‌గా చీతాల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. అయితే రేడియో కాల‌ర్ వ‌ల్లే ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఆరు చీతాల రేడియో కాల‌ర్ల‌ను తొల‌గించారు. ఇక‌పై చీతాల క‌ద‌లిక‌ల‌ను ప‌సిగ‌ట్టేందుకు డ్రోన్ల‌ను ఉప‌యోగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మోదీ దురభిమానం ఫలితమే: జైరాంరమేశ్‌

కునో నేషనల్‌ పార్క్‌లో తాజాగా మరో చీతా మరణంపై కాంగ్రెస్‌ నేత, పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాం రమేశ్‌ కేంద్ర ప్రభుత్వంపై బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాస్త్ర పరిజ్ఞానం, పారదర్శకత వెనుకపట్టు పట్టడం వల్లే చీతాలు మరణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి వయసు అయిపోయినందునే చనిపోయాన్న వాదనలు పూర్తిగా మతిలేనివని స్పష్టంచేశారు.

అంతర్జాతీయ చీతా నిపుణులు సైతం వాటిని తోసిపుచ్చారని పేర్కొన్నారు. తాజాగా మరో చీతా ప్రాణం కోల్పోయిందన్న వార్తలపై ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నిజానికి కునో పార్క్‌లో ఏదో తప్పు జరిగిందని వ్యాఖ్యానించారు. ‘సైన్స్‌, పారదర్శకతకు తిలోదకాలు ఇవ్వడంతోనే చీతాలు చనిపోతున్నాయి.

ఒక మనిషి దురభిమానంతో, తన గొప్పదనాన్నిచాటుకునే ఆశతో చేసిన ప్రయత్నం ఫలితమే ఇది’ అని ఆయన పరోక్షంగా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. దేశంలో చీతాలను తిరిగి తెప్పించామని చాటుకునేందుకు మోదీ ప్రభుత్వం 20 చీతాలను ఖండాలు దాటించి తెప్పించిన విషయం తెలిసిందే.

Latest News