వరంగల్: బల్దియా ఏకపక్ష ఎజెండా ఏంటో..?

• సమస్యలు లేనట్లు పాలకవర్గం తీరు • సమావేశంలో స‌మ‌స్య‌లు లేవనెత్తిన కార్పొరేటర్లు • అభివృద్ధి వల్లే వరంగల్‌కు ర్యాంక్ • అన్నపూర్ణ చెల్లింపునకు మాత్ర‌మే గ్రీన్‌సిగ్నల్ విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద సిటీగా ఉన్న వరంగల్ బల్దియా పాలకవర్గం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో అసలే సమస్యలు లేనట్లు బల్దియా కౌన్సిల్ సమావేశంలో ఒకే ఒక […]

  • Publish Date - December 17, 2022 / 04:29 PM IST

• సమస్యలు లేనట్లు పాలకవర్గం తీరు
• సమావేశంలో స‌మ‌స్య‌లు లేవనెత్తిన కార్పొరేటర్లు
• అభివృద్ధి వల్లే వరంగల్‌కు ర్యాంక్
• అన్నపూర్ణ చెల్లింపునకు మాత్ర‌మే గ్రీన్‌సిగ్నల్

విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద సిటీగా ఉన్న వరంగల్ బల్దియా పాలకవర్గం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలపై సర్వత్ర నిరసన వ్యక్తం అవుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో అసలే సమస్యలు లేనట్లు బల్దియా కౌన్సిల్ సమావేశంలో ఒకే ఒక ఎజెండాను ప్రకటించి తమ డొల్లతనాన్ని చాటుకున్నారు. అయితే ఈ ఎజెండాను పట్టించుకోకుండా సమస్యలు లేవనెత్తి పాలక వర్గం ఏకపక్ష విధానాలను విపక్షాలతో పాటు విభిన్న వర్గాలు తీవ్రంగా విమర్శించాయి.

జెండాలో ప్రజా సమస్యలకు చోటేదీ

వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం జరిగింది. గ్రేటర్ పరిధిలో నిత్యం ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, మంచినీటి సరఫరా విద్యుత్ దీపాలు, పరిశుభ్రత అంటురోగాలు, ట్రాఫిక్ తదితర సమస్యలు ఉన్నప్పటికీ ఇవేమీ లేనట్లు బల్దియాలో కేవలం ఒక్క ఎజెండా అన్నపూర్ణ చెల్లింపులను మాత్రమే పొందుపరిచి బల్దియా కౌన్సిల్ సమావేశం నిర్వహించడంతో ప్రజా సమస్యలపై అధికార పార్టీకి పాలకవర్గానికి పట్టింపు లేదని మండిపడుతున్నారు.

ఈ మాత్రానికి బల్దియా సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం ఉందని విమర్శిస్తున్నారు. పాలకవర్గం తమ మెజారిటీని ఆసరా చేసుకుని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని విపక్షాలు విమర్శిస్తుండగా డివిజన్లో సమస్యలు పేరుకుపోయి ప్రజలకు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్లు పార్టీలకతీతంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక బల్దియాలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నా కూడా ప్రశ్నించేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బల్దియా సమావేశంలో లేవనెత్తిన సమస్యలకు కూడా కనీస జవాబుదారీతనం లేదని పలువురు కార్పొరేటర్లు మండిపడుతున్నారు.

అభివృద్ధిపై గ్రూపుల ప్రభావం

పాలకవర్గంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల మధ్య సమన్వయం లేక గ్రూపులతో నగర అభివృద్ధి కుంటు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకవర్గం తన పద్ధతి మార్చుకోవాలని కోరుతున్నారు. ఇటీవల గ్రేటర్ పరిధిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు తమకు రావలసిన బకాయిలు చెల్లించకుండా ఏం చేస్తున్నారని బల్దియా ముందు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాంట్రాక్టర్లు తాము చేపట్టిన అభివృద్ధి పనులను నిలిపివేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పనులు చేపట్టేందుకు నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ దీని గురించి బల్దియా కౌన్సిల్ సమావేశం పెద్దగా చర్చించిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కీర్తించేందుకు ఇస్తున్న ప్రాధాన్యత ప్రజా సమస్యల పట్ల లేకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ముందు ప్రతిపాదించిన అన్నపూర్ణ పథకం కింద రూ.1.65కోట్ల చెల్లింపు కోసం చేపట్టిన ఏకైక ఎజెండా అంశానికి సమావేశం ఆమోదం తెలిపింది.

బల్దియాకు 3వ ర్యాంకు

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ (MOHUA) మంత్రిత్వ శాఖ ద్వారా స్వచ్ సర్వేక్షన్ 2022 ఫాస్ట్ మూవింగ్ సిటీస్ లో జాతీయ స్థాయిలో చరిత్రాత్మక ఓరుగల్లు నగరం 3వ ర్యాంకు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షన్ 10 లక్షల లోపు జనాభా నగరాల్లో జాతీయ స్థాయిలో 115 ర్యాంక్ పొందాగా ఈ ఏడాది 62 వ ర్యాంక్ సాధించి 53 స్థానాలు మెరుగుపరచుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు.

భజనకే అధిక ప్రాధాన్యత

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిశా నిర్దేశనంలో రాష్ట్ర ఐ.టి మరియు మున్సిపల్ శాఖామాత్యులు తారక రామారావు ఆదర్శవంతమైన, పారదర్శక పాలనను అందిస్తూ సుస్థిరాభివృద్దిని సాధించిందని కొనియాడారు. వరంగల్ మహానగరం పై ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపు, ప్రతిష్టాత్మకమైన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రతి నెలా నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కొరకు కేటాయించారన్నారు.

సమస్యల పై ప్రశ్నించిన కార్పొరేటర్లు

కౌన్సిల్ సమావేశమైనందున ఎజెండాలో లేకున్నా ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను మేయర్, కమీషనర్ దృష్టికి తెచ్చారు. కోతుల, పందుల, కుక్కల బెడద, మిషన్ భగీరథ పైపుల లీకేజీ, విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, స్మశాన వాటికల ఏర్పాటు, రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీలు నిర్మాణం, అంతర్గత రోడ్లు, మంచినీటి పైప్‌లైన్ల‌ కనెక్షన్స్, మంజూరైన పనులను కాంట్రాక్టర్ ప్రారంభించక పోవడం, సకాలములో కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోవడం వంటి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లు కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను మేయర్ సుధారాణి ఆదేశించారు.

సమావేశంలో బల్దియా కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా శమీమ్ మసూద్, కార్పొరేటర్లు, బల్దియాలోని వివిధ విభాగాల ఉన్నత అధికారులు, పబ్లిక్ హెల్త్, విద్యుత్, వైద్య ఆరోగ్యశాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.