ఒక పోలీసు, ఒక మావోయిస్టు మృతి
రాయపూర్ : ఛత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో ఛోటా బిఠియా పోలీస్ స్టేషన్ పరిథిలోని ఈదూర్ గ్రామ శివారుల్లో ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకరంగా సుమారు అరగంట సేపు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో బస్తర్ ఫైటర్స్‌కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ చనిపోగా, ఒక నక్సల్ కూడా మృతి చెందాడు. కాంకేర్ ఏఎప్పీ అవినాష్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఈదూర్ గ్రామ శివార్లలో నక్సల్స్ పెద్ద ఎత్తున జమ అయి వున్నారని సమాచారం అందిందని తెలిపారు. దానితో కాంకేర్ నుండి బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ తదితర బలగాలు ఈదూర్ అడవుల్లోకి తరలి వెళ్లాయని, గాలింపు చర్యల సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
అరగంటల తర్వాత నక్సల్స్ అడవుల్లోకి తప్పించుకు పారిపోయారని తెలిపారు. ఈ ఘటనలో రమేష్ కురేటి అనే పోలీస్ కానిస్టేబుల్ చనిపోయాడని చెప్పారు. పోలీసులు జరిపిన జవాబీ కాల్పుల్లో ఒక నక్సల్ కూడా మృతి చెందాడు. మృతి చెందిన నక్సల్ శవాన్ని స్వాధీనం చేసుకొన్నామని తెలిపారు. ఘటనాస్థలంలో ఒక ఏకే -47 తుపాకిని కూడా బలగాలు స్వాధీనం చేసుకొన్నాయి. చనిపోయిన నక్సల్ వివరాలు ఇంకా తెలియవలసివుంది. మృతి చెందిన కానిస్టేబుల్ కురేటి పకాంజూర్ ఏరియాలోని సంగం గ్రామానికి చెందిన వాడు. సంఘటన అనంతరం పోలీసు కూంబింగ్ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అవినాష్ ఠాకూర్ తెలియజేసారు.