విధాత: పోరాటాలలోనే మనుగడ ఉండటమే కాదు, ఉద్యమ అభివృద్ధి విస్తరణ ఉంటుందని నమ్మే వామ పక్షాలు ఉద్యమాలను పక్కన పెట్టేశాయి. నిత్యం ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించటంతోనే తిరిగి అధికారానికి చేరువ అవుతామని నమ్మే కాంగ్రెస్ పార్టీ కాడెత్తేసింది. నిత్య సంఘర్షణలోంచే పునరుజ్జీవనం, పూర్వవైభవం పొందవచ్చు అనే సాధారణ కార్యాచరణను కూడా విపక్షాలు విడిచిపెట్టేశాయి. అధికార పార్టీ అంటకాగుతూ.. దాని నీడలో ఉనికిలో ఉన్నామని చాటేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం వంతుకు కాలాడించినట్లు ఉద్యమాలకు పిలుపు ఇచ్చి మమ అనిపించుకొంటున్నది.
తెలంగాణలో అధికార పార్టీ.., నేతలు తెలంగాణను దోచుకుతింటున్నారని మాట్లాడుతున్న విపక్ష పార్టీలు… ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో ఉద్యమాలను నిర్మించటంలో పూర్తిగా విఫలమయ్యాయి. అందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదు. విపక్షాలకు అధికార పార్టీ అంటే భయమో… లేదా… అన్నీ టీఆర్‌ఎస్ చేసింది… కాబట్టి మనం చేయడానికేమీ లేదని భావిస్తున్నాయో కానీ… ప్రకటనలు మినహా పోరాటాలకు పోవడం లేదు. విపక్షాల ఈ బలహీనతలే అధికార పక్షానికి కొండంత బలాన్నిస్తున్నాయి.
తెలంగాణలో సమస్యలు లేవు..
రాష్ట్రం అభివృద్ధి ఫథంలో దూసుకువెళుతున్నది, కాబట్టే తెలంగాణలో సమస్యలు లేవు. అందుకే రాష్ట్రంలో నిరసనలు, ఉద్యమాలు లేవని అధికార పక్షం చెపుతున్నది. రాజకీయంగా తమను ఎదుర్కోలేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర సంస్థల చేత దాడులు చేయిస్తూ తెలంగాణను అస్థిర పరచాలని కుట్రలు చేస్తున్నదని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఉద్యమాల విధానానికి తిలోదకాలు..
ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్మించే ఓపిక, శక్తి నేటి నేతలకు లేనట్లుగా కనిపిస్తున్నది. ఇందుకు మారిన నేతల వైఖరే కారణమన్న అభిప్రాయం ఉన్నది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయడం ద్వారా ఓట్లు సంపాదించుకోవచ్చునన్న ఆలోచనా ధోరణి కారణంగానే నేతలు సమస్యలపై ఉద్యమాలు చేసే విధానానికి తిలోదకాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే మేమున్నామంటూ ముందుకు వచ్చే కమ్యూనిస్టులు సైతం ఉద్యమాలకు తిలోదకాలిచ్చారన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
ఎన్టీఆర్ హాయం నుంచే కమ్యూనిస్టుల పతనం ప్రారంభం
తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం నుంచి వచ్చిన కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై నిత్యం సమర శీలంగా ఉండేవారు. పోరాటమే ఊపిరి, ఆందోళనే ఆయుధంగా ఉద్యమించేవారు. ఎప్పుడైతే.. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీతో రాజకీయ పొత్తు పెట్టుకొన్న తర్వాత కమ్యూనిస్టుల పతనం ప్రారంభమైంది. ఉద్యమాలు విడిచిపెట్టి పైరవీ కారులుగా అవతారమెత్తారు. అధికార వర్గాలకు చేరువై అందిన కాడికి సొంతం చేసుకోవటం అలవాటయ్యింది. అధికార వర్గాల చుట్టూ తిరుగుతూ విజ్ఞాపనలు, మహాజర్లు ఇచ్చే వారుగా తయారయ్యారు.
ధరణి సమస్యతో సీఎంనే వేడుకున్న ఓ కమ్యూనిస్టు నేత
ప్రజా సమస్యలు అటుంచి.., తమ సొంత సమస్యల కోసమే అధికార వర్గాల చుట్టూ తిరిగే దుస్థితికి చేరుకున్నారు. ధరణి కారణంగా ఓ కమ్యూనిస్టు నేతకు భూమి సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించమని సదరు నేత ఏకంగా సీఎంనే వేడుకొన్నాడు. లదెంత పని… వెంటనే పని పూర్తి చేయండని సీఎం అధికారులను ఆదేశించారు. ఎన్నికలు అయిపోయాయి. కానీ ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. సదరు నాయకుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. ఒక వామపక్ష జాతీయ నాయకుడు కొనుగోలు చేసిన భూమి కూడా ధరణితో ఇలాంటి స్థితిలోనే ఉన్నది.
సమస్యలకు మూలం ధరణి
అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసమంటూ టీఆర్ ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి అదే సమస్యలకు మూల మవుతున్నది. ధరణితో వస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రజానాయకులుగా పలుకుబడి ఉన్నవారికే ధరణితో ఏర్పడిన చిక్కులు అనేకం. ఇక సాధారణ ప్రజల ఇబ్బందులు ఎన్నని చెప్పాలి, వీటన్నింటినీ ఎవరు పరిష్కారిస్తారో ఎవరికీ అంతుపట్టని విషయంగా మారిందంటూ వాపోతున్నారు ప్రజలు.
రోజుకు 250 దాకా మంత్రి చెంతకు వస్తున్న ధరణి సమస్యలు
ఈ మధ్య కాలంలో ఒక మంత్రి తన వద్దకు రోజుకు 250 నుంచి 300 మంది ధరణి సమస్యలు పరిష్కరించమని వస్తున్నారు. ఏమి సమాధానం చెప్పాలని అధికారులను అడుగుతున్నా పట్టించుకున్న వారులేరు. ధరణిపై రాష్ట్ర మంత్రి వర్గం, ఉప సంఘం నిర్ణయాలైనా అమలవుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నాటి చేవ నేడు ఎక్కడ….
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విద్యుత్ చార్జీల పెంపు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యమాన్ని నిర్మించాడు. ఆ క్రమంలోనే బషీర్ బాగ్‌లో విద్యుత్ ఉద్యమకారులపై కాల్పులు జరిపి చంద్రబాబు ప్రజాగ్రహానికి గురయ్యాడు. ఈ ఉద్యమంతో ఆగని వైఎస్ రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టి ఏకంగా అధికారాన్నే హస్తగతం చేసుకొన్నాడు.
తెలంగాణ కోసం నేటి ముఖ్యమంత్రి కె, చంద్రశేఖర్‌రావు పార్టీని స్థాపించి బయలు దేరాడు. పట్టువిడవని విక్రమార్కుడిగా తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్మించాడు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు వెళ్లలేక హైదరాబాద్‌కు పరిమితమయ్యారు. రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొన్నారు.
మారిన నేతల వైఖరి..
నిరంతరం ప్రజల మధ్య ఉంటూ విపక్ష పార్టీలుగా పోరాడాల్సిన వారు.. ఎజెండా ప్రకటించాం… మనం చేసేది ఏముందన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకువచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరుతో తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తాం అని ప్రకటన చేయించారు. ఆ తరువాత దానిని వదిలేశారు. ధరణితో పాటు అనేక సమస్యలున్నప్పటికి… ప్రజల పక్షాన నిలిచే వారు కరువైన స్థితి ఏర్పడింది.
అధికార పార్టీ నేతలు సైతం..
మరో వైపు అధికార పార్టీ నేతలు సైతం.. సీఎం వద్దకు వెళ్లి సమస్యను చెప్పుకోలేని దుస్థితి ఉన్నదంటున్నారు. ధరణి సమస్య అధికార పార్టీ నేతలను జేజమ్మలాగా క్షేత్ర స్థాయిలో వెంటాడుతున్నా.. ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తున్నది. విపక్ష నేతలు కూడా ఇందుకు ఏమాత్రం తీసి పోని విధంగా ఎజెండాలు ప్రకటించి పోరాటాలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలోనే మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలో కాంగ్రెస్ ధర్నాలు, ఆందోళనలు చేసి తమ పని అయిందని చేతులు దులుపుకున్నది.
గొంతులు మూగ పోవడంతో…
సీఎం కేసీఆర్ రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాల ప్రకటిస్తే… రైతులు తమ భూమి సమస్యల పరిష్కరానికి ధరఖాస్తు చేసుకోవాలంటే కనీసం వేయి రూపాయాలు ఫీజుగా చెల్లించుకునే స్థితి తెచ్చారని వాపోతున్నారు. రైతులు తమ సమస్య పరిష్కరించాలని ధరణిలో దరఖాస్తు చేసిన ప్రతీ సారి ఫీజుగా వేయి రూపాయల వరకు చెల్లించాల్సి రావడంతో ధరణి అంటేనే వణికిపోయే స్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో రైతులకు భరోసా ఇచ్చి అండగా నిలబడాల్సిన విపక్ష నేతలు తమ బాధ్యతను విస్మరించారు. ఫలితంగా రాష్ట్రంలో తమకు అండగా ఒకరు ఉన్నారన్న ధైర్యం లేక సగటు రైతు అనాథగా రోధిస్తున్నాడు.
కమ్యూనిస్టుల చారిత్రక తప్పులు..
మన కమ్మూనిస్టులకు చారిత్రక తప్పులు చేయటం అలవాటు. నాడు ఎన్‌టీఆర్ పంచన చేరి రెండు సీట్లు ఎక్కువ గెలిచారేమో కానీ.., అందుకు త్యాగాల పోరాట వారతసత్వాన్ని తాకట్టు పెట్టిన వారుగా మిగిలిపోయారనే విమర్శ ఉన్నది. అవసరం తీరిన తర్వాత అదే ఎన్టీఆర్ కమ్యూనిస్టులను కుక్కమూతి పిందెలని ఎద్దేవా చేసినా సర్దుకుపోయిన దుస్థితి వామపక్షాలది.
అధికార పార్టీ చంకన చేరిన వామపక్షాలు
ఇప్పుడు అదను చూసి పదను పెట్టే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికలకు ముందు.. కమ్యూనిస్టు నేతలను బుజ్జగించి మద్దతు కోరారు. నిన్నటి దాకా తోక పార్టీలు అన్నది మరిచి పోయి అడిగిందే తడవుగా వామపక్షాలు ఆవురావురుమని అధికార పార్టీ చంకన చేరాయి. ఇప్పుడు కూడా ఒకటో రెండో సీట్లు దక్కితే దక్కొచ్చేమో కానీ… చరిత్ర ప్రజల పక్షాన ఇచ్చిన బాధ్యతను మరిచిపోవటం కమ్యూనిస్టులది చారిత్రక ద్రోహం కాదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.