విధాత: దేశ రాజధాని ఎర్రకోట కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర దినోత్సవాల్లో తెలంగాణ కీర్తి పతాక రెపరెపలాడింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కళాకారులు, విద్యార్థులు స్థానం సంపాదించారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో నిర్వహించే ప్రదర్శనల్లో దేశంలోని వివిధ ప్రాంతాల కళా ప్రదర్శనలకు చోటు లభిస్తుంది. అందులో వరంగల్ కు చెందిన కళాకారిణికి స్థానం దక్కటం ముదావహం.
హనుమకొండకు చెందిన కూచిపూడి నృత్యకారిణి కాట్రగడ్డ హిమాన్సి చౌదరి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో కూచిపూడి ప్రదర్శించారు. ఉన్నత చదువులు చదివినా దేశ కళా సంస్కృతులపైన అభిమానంతో కూచిపూడినే ప్రవృత్తిగా స్వీకరించారు. అందులో టెంపుల్ డ్యాన్స్ పేర ఓ నృత్యరూపకాన్ని రూపొందించి నిరాదరణకు గురవుతున్న ఆలయాల పునరుద్ధరణకు పూనుకుంటున్నారు. ఆమె చేస్తున్న త్యాగపూరిత కృషికి గాను హిమాన్సి చౌదరికి గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది.
అలాగే… వరంగల్ పట్టణానికి చెందిన లాల్‌బహదూర్ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ కెడెట్లు మహేందర్, రాకేశ్‌లకు పరేడ్‌లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ పరేడోలో పాల్గొనేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి 12మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. అందులో ఇద్దరు మన తెలంగాణ వరంగల్‌కు చెందిన వారే కావటం హర్షణీయం.