Site icon vidhaatha

Passports | పౌరసత్వం వదిలేస్తున్నారు! గణనీయంగా పెరిగిన పాస్‌పోర్టుల సరెండర్‌

Passports |

ఇటీవలే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ తిరిగి భారతదేశ పౌరసత్వం పొందాడు. ఆయన కెరీర్‌ బాగా ఇబ్బందుల్లో పడిన సమయంలో కెనడా పౌరసత్వం తీసుకుని.. భారత పాస్‌పోర్ట్‌ను కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ భారత పౌరసత్వం తిరిగి పొందాడు. ఒకప్పుడు అక్షయ్‌కుమార్‌ ఎందుకు పౌరసత్వం వదులుకున్నాడో అదే కారణాలతోపాటు.. మెరుగైన జీవితం, ఉపాధి, సామాజిక ప్రయోజనాల కోసం ఏటా పెద్ద సంఖ్యలో భారతీయులు పౌరసత్వాన్ని వదులుకుని, ఇతర దేశాల పౌరులుగా మారిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022లో భారత పౌరసత్వం వదులుకున్నవారి సంఖ్య 2,25,620. భారత పౌరసత్వం వదులకోవాలని నిర్ణయించుకున్నవారు.. పౌరసత్వం పొందాలనుకుంటున్న దేశంలో కనీసం ఐదారేళ్లు స్థిర నివాసం ఉండాలి. అప్పుడే వారు ఆ దేశ పాస్‌పోర్ట్‌ పొందేందుకు అర్హత సాధిస్తారు. అంటే.. 2022లో పౌరసత్వం వదులుకున్న 2,25,620 మంది.. ఐదారేళ్ల ముందే నిర్ణయించుకున్నారన్నమాట!

న్యూఢిల్లీ: ఏటా వివిధ కారణాలతో దేశ పౌరసత్వాన్ని వదిలేసేవారు ఉంటున్నప్పటికీ.. గత ఏడాది పాస్‌పోర్టులు సరెండర్‌ చేసినవారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నది. 225,620 మంది భారత పౌరసత్వం వదులుకున్నారని కేంద్రం ఇటీవల వెల్లడించిన వివరాలు.. పార్లమెంటులోనే కాదు.. యావత్‌దేశంలో కలవరం రేపాయి. అయితే ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో పౌరసత్వాన్ని వదిలేస్తున్నారు? ఈ వివరాలు ఏం చెబుతున్నాయి? ఇదేమైనా ఆందోళనకర పరిస్థితికి సంకేతమా? ద్వంద్వ పౌరసత్వంతో దీనిని పరిష్కరించవచ్చా?

కొవిడ్‌ తర్వాత గణనీయంగా పెరుగుదల

2011 నుంచి 2022 వరకూ గణాంకాలు పరిశీలిస్తే.. సగటున ఏటా 1,38,620 మంది పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నారు. కొవిడ్‌ ముందు, కొవిడ్‌ తర్వాత సంవత్సరాల్లో చూస్తే.. 2011 నుంచి 2019 వరకు సగటున ఏటా 1,32,133 ఉంటే.. కొవిడ్‌ తర్వాత.. 2020 నుంచి 2022 వరకు వార్షిక సగటు 1,58,082గా ఉన్నది. ఇందులోనూ కొవిడ్‌ మొదటి సంవత్సరంలో ఉన్న పరిస్థితులు, లాక్‌డౌన్‌ నేపథ్యంలో 85,256 మంది మాత్రమే పాస్‌పోర్టులు సరెండర్‌ చేశారు.

తర్వాతి రెండేళ్లలో గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తున్నది. గత పన్నెండేళ్ల సగటును పరిగణనలోకి తీసుకుంటే.. 2022లో 2,22,620 మంది తమ పౌరసత్వాలను వదిలేసుకోవడం అసాధారణంగా కనిపిస్తున్నది. కొవిడ్‌ కాలంలో వీసాల ప్రాసెసింగ్‌ జాప్యం వల్ల గత ఏడాది ఈ సంఖ్య గరిష్ఠంగా ఉన్నదని అనుకునేందుకు అవకాశం ఉన్నది.

ఎందుకంటే 2019లో 85,256 మంది మాత్రమే పౌరసత్వం వదులుకున్నారు. ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో క్లియరెన్సులు వచ్చి.. సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉన్నది. అయితే.. ఈ సంఖ్యలను మీరు గమనిస్తే.. మరో ధోరణిని కూడా గమనిస్తారు. అదే కొవిడ్‌కు ముందు (2011 to 2019) వార్షిక సగటు, కొవిడ్‌ తర్వాత వార్షిక సగటు. కొవిడ్‌కు ముందు వార్షిక సగటు 1,32,133 ఉంటే.. కొవిడ్‌ తర్వాత అంటే.. 2020 నుంచి 2022 వరకు అది 1,58,802కి ఎగబాకింది.

అంటే 20శాతం పెరుగుదల కనిపిస్తున్నది. కొవిడ్‌ తర్వాత పౌరసత్వం వదులుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని దీని బట్టి అర్థమవుతున్నది. కొవిడ్‌కు ముందు ఆర్థిక, విద్య, నాణ్యమైన జీవితం వంటి అంశాలపై వలసలు ఉండేవి. విదేశాల్లో పౌరసత్వం అవసరం లేకుండా ఈ వెసులుబాట్లు లేదా సౌకర్యాలు పొందవచ్చు. అయితే.. కొవిడ్‌ తర్వాత గ్లోబల్‌ మొబిలిటీ అనేది పౌరులు విదేశీ పౌరసత్వం కోరుకునేందుకు దోహదం చేస్తున్న అంశంగా ఉన్నది.

అమెరికా పాస్‌పోర్ట్‌తో 150కిపైగా దేశాలకు వీసా ఫ్రీ

భారతీయ పాస్‌పోర్ట్‌ అంత శక్తిమంతమైనది కాదు. కేవలం 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం మనకు ఉన్నది. అందులోనూ ఆసియా, ఆఫ్రికన్‌, కరేబియన్‌ దేశాలే ఎక్కువ. కానీ.. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండానే 150కి పైగా దేశాలకు వెళ్లే అవకాశం ఉన్నది. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అంగీకరించదు. అయితే.. ఇతర దేశాల్లో పౌరసత్వం పొందేందుకు అవకాశం ఉన్న భారతీయులు అందుకోసం భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

ద్వంద్వ పౌరసత్వంపై మళ్లీ చర్చ

భారతదేశం ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం కల్పించాలనే చర్చ కూడా ఈ అంశం నుంచీ సాగుతున్నది. ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తే వేరే దేశాల పాస్‌పోర్ట్‌ పొందాలనుకునే వారు భారత పౌరసత్వాన్ని కూడా కొనసాగించుకునే అవకాశం కలుగుతుందనేది కొందరి భావన. అప్పుడు అమెరికా, బ్రిటన్‌, కెనడా వంటి దేశాల పాస్‌పోర్ట్‌ పొంది కూడా భారతీయ పౌరసత్వాన్ని కొనసాగించుకోవచ్చు.

ఎందుకంటే సదరు దేశాలు ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం ఇస్తున్నాయి. ద్వంద్వ పౌరసత్వం వల్ల ఆయా దేశాల పౌరులకు ఉండే అన్ని హక్కులు, ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. ద్వంద్వ పౌరసత్వం, లేదా బహుళ పౌరసత్వాలు వలన కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. వీసా లేకుండానే మరిన్ని దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలు కలుగుతుంది.

అయితే.. రెండో పాస్‌పోర్ట్‌ లేదా ద్వంద్వ పౌరసత్వం అవకాశం భారతీయులకు కలుగుతుందా? భారతీయుడిగా ఉండి వేరే దేశపు పాస్‌పోర్ట్‌ కలిగి ఉండేందుకు భారత రాజ్యాంగం అనుమతించదు. భారతీయులెవరైనా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే.. భారత పౌరసత్వం దానంతట అదే రద్దయిపోతుంది. దానితోపాటు పాస్‌పోర్ట్‌ను అప్పగించాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా విధిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు వెంటనే పౌరసత్వం ఇవ్వవు.

ముందుగా అక్కడ ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పర్మనెంట్‌ రెసిడెన్సీ స్టేటస్‌తో అక్కడ నివసించాలి. ఆ తర్వాత వారు పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. అంటే.. అంటే.. ఈ ఏడాది పౌరసత్వం వదులుకున్నవారు అంతకు ఐదారేళ్ల క్రితమే భారతదేశం నుంచి వెళ్లిపోయినవారన్నమాట. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, తమిళనాడు, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో పాస్‌పోర్టులు సరెండర్‌ చేస్తున్నారు.

ఆ దేశాలకే వలసలు

భారతదేశ పౌరసత్వం వదులుకుంటున్నవారిలో అత్యధికంగా దుబాయి, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, మాల్టా, కరీబియన్‌ దీవులలో సెటిల్‌ అవుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్‌, బ్రిటన్‌, అమెరికావంటివి భారతదేశం నుంచి నైపుణ్యం కలిగినవారిని ఆకర్షిస్తున్నాయి. కొంతకాలం క్రితం అత్యున్నత నైపుణ్యాలు కలిగి ఉన్నవారిని పలు దేశాలు ఆకర్షించి, వారికి పౌరసత్వం కల్పిస్తే.. ఇటీవలి కాలంలో సెమీస్కిల్డ్‌, లేబర్‌కు కూడా పలు దేశాలు ఉత్తమ వేతనాలు, మెరుగైన వసతులు, జీవనపరిస్థితులు కల్పించడం ద్వారా ఆకర్షిస్తున్నాయి.

ఇవీ ప్రధాన కారణాలు

ప్రయాణాలు : అమెరికా వంటి చాలా దేశాలు తమ పౌరులు వీసా లేకుండా ఎక్కువ దేశాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా వెళ్లాలనుకునేవారికి వీసా పొందేందుకు నెలలు పడుతుంది. కానీ.. ఆస్ట్రేలియా వంటి దేశాల పౌరులు వీసా లేకుండానే పర్యటనకు వెళ్లపోవచ్చు.

పని : కొన్ని దేశాలు పరస్పర పనిహక్కులు కల్పిస్తాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియన్‌ పౌరుడు ప్రత్యేకమైన ఈ-3 వీసాపై అమెరికా వెళ్లి పనిచేసుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది దీనిని ఉపయోగించుకుంటారు.

సామాజిక భద్రతా ప్రయోజనాలు: కొన్ని దేశాలు ఇతర దేశాల్లో కూడా సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందేందుకు అనుమతిస్తాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియన్‌ పౌరుడు న్యూజీలాండ్‌లో ట్రాన్స్‌ టాస్‌మన్‌ మ్యూచువల్‌ రిక్నగిషన్‌ యాక్ట్‌ ప్రకారం విద్య, వైద్య తదితర సదుపాయాలు ఉచితంగా పొందవచ్చు. ప్రభుత్వ రంగంలోనూ, కీలకమైన రంగాల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు.

2011 నుంచి 2023లో ఇప్పటి వరకూ పౌరసత్వాన్ని వదిలేసినవారి సంఖ్యను గమనిస్తే

సంవ‌త్స‌రం పౌరసత్వాన్ని వదిలేసినవారి సంఖ్య
2011 1,22,819
2012 1,20,923
2013 1,31,405
2014 1,29,328
2015 1,31,489
2016 1,41,603
2017 1,33,049
2018 1,34,561
2019 1,44,017
2020 85,256
2021 1,63,370
2022 2,25,620
2023 87000

(ఇప్పటి వరకు)

Exit mobile version