విధాత: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ గా మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ను నియమించడం పట్ల కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో మంగళవారం జరిగిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 11 వర్ధంతి కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ సింగ్ రాకతో కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపానన్నారు.
అలాగే సీనియర్లతో మాట్లాడి హుజరాబాద్ ఎన్నికల్లో పిసిసి ఎందుకు ప్రచారం చేయలేదో దిగ్విజయ్ విచారణ చేయాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో నాకు తెలియకుండా సభ పెట్టి నన్ను తిట్టడం పైన, మార్ఫింగ్ వీడియోలపైన దిగ్విజయ విచారణ జరపాలని వెంకట్ రెడ్డి కోరారు. ఢిల్లీ నుండి తనకు ఉత్తంకుమార్ రెడ్డి ఫోన్ చేసి దిగ్విజయ్ సింగ్ నియామకం విషయాన్ని చెప్పారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త, పిసిసి చీఫ్ అంతా సమానమేనని తాను గతంలోనే చెప్పానన్నారు. గాంధీభవన్లో పైరవీకారులు ఇచ్చిన లిస్టుపై కనీసం జిల్లా నాయకులతో చర్చించలేదని, నల్గొండ జిల్లా కమిటీ తో పాటు కొన్ని నియోజకవర్గాల నుండి పిసిసి కమిటీలలో బలమైన నాయకులకు చోటు దక్కలేదన్నారు. 20 నెలలుగా జిల్లాల వారిగా పిసిసి ప్రెసిడెంట్ మీటింగ్‌లు పెట్టలేదన్నారు.
లక్ష ఎకరాల కు సాగు నీరు అందించే ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేస్తే నాకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జనవరిలో రైతు పాదయాత్ర పేరుతో ఉద్యమం చేస్తానన్నారు. ఈ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటానన్నారు.
ఉదయ సముద్రం( బ్రాహ్మణ వెల్లంల ), ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈ పాదయాత్ర ద్వారా రైతు ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్టాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్న పక్క రాష్ట్రం ఏపీలో సీఎం జగన్ రోగాల బారిన పడిన పేదలకు వెయ్యి బిల్లు దాటితే ప్రభుత్వమే భరించేలా పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
తెలంగాణలో లక్షల రూపాయల బిల్లులు చెల్లించలేక పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పక్క రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. కళాశాలలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక విద్యార్థులు తమ చదువుల కొనసాగింపుకు ఆర్థిక సాయం కోరుతూ తమ వద్దకు వస్తున్నారన్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
అంతకుముందు వెంకటరెడ్డి తన దివంగత కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 11 వర్ధంతి సందర్భంగా నల్గొండ ప్రతిక్ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. పేద విద్యార్థులు ఫీజులకు ఇబ్బంది పడకుండా తన సహాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.