పాక్‌లో ఖ‌లిస్థానీ ఉగ్ర‌వాది అనుమానాస్ప‌ద మృతి..

పాకిస్థాన్‌ లో మ‌రో భార‌త వ్య‌తిరేక భావ‌జాలం ఉన్న వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించాడు

  • Publish Date - December 5, 2023 / 08:34 AM IST

విధాత‌: పాకిస్థాన్‌ (Pakistan) లో మ‌రో భార‌త వ్య‌తిరేక భావ‌జాలం ఉన్న వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మ‌ర‌ణించాడు. నిషేధిత ఖ‌లిస్థానీ లిబ‌రేష‌న్ ఫోర్స్ (కేఎల్ఎఫ్‌), ఇంట‌ర్నేష‌న‌ల్ సిఖ్ యూత్ ఫెడ‌రేష‌న్ (ఐవైఎస్ఎఫ్‌) నాయ‌కుడు ల‌ఖ్బీర్ సింగ్ రోడె సోమ‌వారం నాడు మృత్యువాత ప‌డ్డాడు. ఖ‌లిస్థానీలు అత్యున్న‌త వ్య‌క్తిగా భావించే జ‌ర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేకు ల‌ఖ్బీర్ స్వ‌యానా మేన‌ల్లుడు కావ‌డం గ‌మ‌నార్హం.


పాకిస్థాన్‌లో ఆశ్ర‌యం పొందుతున్న ఈ ఖ‌లిస్థానీ సానుభూతిప‌రుడు.. పాక్ ఐఎస్ఐ నీడ‌లో ఉంటూ భార‌త వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడు. 72 ఏళ్ల ఇత‌డి మృతిని భార‌త్‌లో ఉంటున్న అత‌డి సోద‌రుడు, అకాలీ త‌క్త్ మాజీ నాయ‌కుడు జ‌స్బీర్ సింగ్ రోడె ధ్రువీక‌రించారు. ‘ల‌ఖ్బీర్ మృతి గురించి అత‌డి కుమారుడు మాకు చెప్పాడు. గుండెపోటు కార‌ణ‌మ‌ని అన్నారు. అంత్య‌క్రియ‌లు పాక్‌లోనే చేసేసిన‌ట్లు చెప్పారు.


ల‌ఖ్బీర్‌కు డ‌యాబెటిస్ చాలా ఎక్కువ‌. అత‌డి భార్య, ఇద్ద‌రు కుమారులు, కుమార్తె కెన‌డాలోనే ఉంటున్నారు’ అని జ‌స్బీర్ చెప్పుకొచ్చాడు. భార‌త పంజాబ్‌లోని మోగా జిల్లాలో జ‌న్మించిన ల‌ఖ్బీర్‌.. తొలుత దుబాయ్‌కు అక్క‌డి నుంచి పాక్‌కు వెళ్లిపోయాడు. కుటుంబాన్ని మాత్రం కెన‌డాకు పంపించేశాడు. 2002లో తొలిసారి ఇత‌డితో స‌హా 19 మందిని త‌మ‌కు అప్ప‌గించాల‌ని భార‌త ప్ర‌భుత్వం పాకిస్థాన్‌కు విజ్ఞ‌ప్తి చేసింది.


భార‌త ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న వివ‌రాల ప్ర‌కారం ల‌ఖ్బీర్‌.. పాక్‌-భార‌త్ స‌రిహ‌ద్దుల వెంబ‌డి ఆయుధాల స‌ర‌ఫ‌రా నెట్వ‌ర్క్‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించేవాడు. పంజాబ్‌లో అల‌జ‌డులు సృష్టించ‌డం, భార‌త్‌కు చెందిన వీవీఐపీల‌పై దాడులు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించేవాడు. యూఏపీఏ కింద ఇత‌ణ్ని ఉగ్ర‌వాదుల జాబితాలోకి భార‌త్ చేర్చింది. 2021లో ఇత‌డికి సంబంధించిన ఆస్తుల‌ను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

Latest News