ఇస్లామాబాద్: పొరుగుదేశం పాక్ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది. విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో జనం పస్తులుండే దుస్థితి నెలకొన్నది. భారీగా పెరిగిన పిండి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో రొట్టెలు కూడా చేసుకోలేని దుస్థితి.
రావల్పిండి బహిరంగ మార్కెట్‌లో పిండి రేటు కిలోకు రూ.150 పలుకుతుండగా.. పంజాబ్ ప్రావిన్స్ షహర్‌నగరంలో 15 కిలోల గోధుమల బస్తా రూ.2,250 ధర పలుకుతున్నది. దాంతో పాటు ప్రభుత్వం సబ్సిడీపై అందించే 25కిలోల సబ్సిడీ పిండి ప్యాకెట్ ధర రూ.3100కి చేరింది.
పెరుగుతున్న పిండి ధరలతో పాక్‌లో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. సింధ్ ప్రావిన్స్‌లోని మీర్‌పూర్‌లో పిండి ప్యాకెట్ల పంపిణీలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వాహనంలో వచ్చిన వ్యక్తులు తక్కువ ధరకే పిండి ప్యాకెట్లను ఇస్తున్నట్లు చెప్పడంతో జనం ఎగబడడంతో గొడవ జరిగింది.
బహిరంగ మార్కెట్లో గోధుమల ధర రూ.5400గా ఉందని పాక్ ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ పేర్కొందని, ప్రభుత్వం ధరలను నియంత్రించకపోతే పిండి ధరలు మరో రూ.5 పెరుగుతాయని తెలిపింది. ప్రభుత్వం గోధుమల కోటాను తక్కువ విడుదల చేస్తుండడం, దీనికి తోడు ఆహార ధాన్యాల కొరత నేపథ్యంలో ధరలు భారీగా పెరుగుతున్నాయని పీఎఫ్‌ఎంఏ మాజీ ప్రెసిడెంట్ ఖలేక్ అర్షద్ స్థానిక మీడియాకు తెలిపారు.