విధాత: అవకాశం దొరికితే, నోరు తెరిస్తే భారత్ పై దుమ్మెత్తిపోసే పాక్ నేతలు, ఎన్నడూ లేనివిధంగా భారత్‌కు స్నేహ హస్తం అందించారు. అనవసర కలహం మాని చేయిచేయి కలిపి నడుద్దామని పాకిస్థాన్ ప్రధాని శెహబాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. పాక్ శాంతిని కోరుకుంటున్నదని, అందుకు చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించటం గమనార్హం.
దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ ఛానెల్‌తో మాట్లాడిన పాక్ ప్రధాని.. జమ్ము కశ్మీర్‌పై నిబద్ధతతో చర్చించు కోవాలని భారత్ ప్రధాని మోదీకి సూచించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంగా అనవసర బాంబులు, తుపాకులపై పెట్టే ఖర్చును తగ్గించుకుందాం.. దక్షిణాసియాలో పొరుగు దేశాలుగా స్నేహంగా మెలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుదాం అని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే… అనవసర తగాదాలతో వనరులను, సమయాన్ని వృథా చేసుకోవటమా.. లేదా శాంతితో అభివృద్ధి బాటన నడవటమా అన్నది మన చేతుల్లోనే ఉన్నదని శెహబాజ్ అన్నారు. పాక్ ఇప్పటికే మూడు యుద్ధాలు చేసింది. యుద్ధాలతో నిరుద్యోగం, పేదరికం మిగిలింది. సహజ వనరులు కరిగిపోయాయి.
ఈ క్రమంలో పాకిస్థాన్ అనేక గుణపాఠాలు నేర్చుకున్నదని ఆయన తెలిపారు. ప్రజలకు శాంతియుత జీవనాన్ని, మెరుగైన జీవన పరిస్థితులను కల్పించేందుకు కృతనిశ్చయంతో కృషి చేస్తున్నదని పాక్ ప్రధాని శెహబాజ్ తెలిపారు.
ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నిత్యావసరాల కోసం జనం అల్లాడుతున్న స్థితి ఉన్నది. గోధుమపిండి కోసం ప్రజలు వీధుల్లో పరుగులు తీస్తున్నారు. మరో వైపు పాకిస్థాన్ తాలిబన్లుగా పిలువబడుతున్న టెర్రరిస్టులతో అంతర్గత అశాంతి నానాటికీ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల సాయాన్ని కోరుతున్న పాక్ ప్రధాని నుంచి ఈ విధమైన ప్రకటన రావటం గమనించదగినది.