Site icon vidhaatha

Defamation Case | రాజకీయ పార్టీలపై పరువు నష్టం కేసు వేయొచ్చు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు..!

Defamation Case | ప్రతి వ్యక్తి తన ప్రతిష్ఠను కాపాడుకునే, పెంపొందించుకునే హక్కు ఉన్నది. ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతి భారతీయుడికి సమాజంలో గౌరవ, మర్యాదలతో జీవించే హక్కు ఉంటుంది. దాన్ని హరించే హక్కు ఎవరికి లేదు. ఎవరైనా తమ పరువుకు భంగం కలిగించినట్లయితే కోర్టులో దావా వేసి నష్ట పరిహారం కోరేందుకు అవకాశం ఉంటుంది. పరువుకు భంగం కలిగించిన వ్యక్తికి రెండు సంవత్సరాల శిక్ష, లేదంటే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరిమానా, శిక్ష రెండు పడే ఛాన్స్‌ ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు వ్యక్తులపై మాత్రమే పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. తాజాగా రాజకీయ పార్టీలపై సైతం పరువు నష్టం కేసు వేయొచ్చని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్​, బీజేపీపై వేసిన పరువు నష్టం కేసును కొట్టివేసేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది.


భారతదేశం వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులుకు రక్షణ అవసరమని కోర్టు తెలిపింది. అయితే, పరువు నష్టం అంత తీవ్రమైన నేరమేమి కానప్పటికీ దాన్ని తేలిగ్గా తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో తమ అభిప్రాయాలు, ప్రత్యేక కోర్టులో ఉన్న పెండింగ్‌లో ఉన్న పురువునష్టం కేసుపై ఎలాంటి ప్రభావం చూపబోవని ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో జస్టిస్​ ఎస్​ దీక్షిత్​ ధర్మాసనం విచారణ జరిపింది. సెక్షన్లు 499, 500 ప్రకారం రాజకీయ పార్టీని వ్యక్తిగా పరిగణించలేమని బీజేపీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై రిజ్వాన్‌ తరఫు న్యాయవాది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఐపీసీ సెక్షన్ 11లో వ్యక్తిని నిర్వచించారని, పార్టీ అనేది చాలా మంది వ్యక్తులతో కూడిన సంస్థ అంటూ వాదనలు వినిపించారు.


ప్రభుత్వాలు, కంపెనీలు, కార్మిక సంఘాలకు, వారి సొంత గౌరవం ఉంటుందని.. ఈ కేసులో పిటిషనర్‌ గౌరవానికి భంగం కలిందనే కారణంతో పరువునష్టం నమోదైంది. అయితే, ప్రత్యేక కోర్టు చర్యలు తీసుకోవడం సరైందేనని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బీజేపీ పిటిషన్​ను కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. 2019లో ఎమ్మెల్సీగా ఉన్న రిజ్వాన్ అర్షద్.. ఎన్నికల సమయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన బీజేపీ, బాలాజీ అశ్విన్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బీజేపీ పార్టీతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడికి సైతం సమన్లు జారీ చేసింది. ఈ ససమన్లను సవాల్​ చేస్తూ బీజేపీ హైకోర్టులో సవాల్‌ చేసింది.

Exit mobile version