నా ఇజం.. హ్యూమనిజం: పవన్ కల్యాణ్‌

తెలంగాణ సాయుధ పోరాటం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పోరాటాల స్ఫూరితోనే తాను ఏపీలో రౌడీలు, గుండాల పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు

  • Publish Date - November 23, 2023 / 12:36 PM IST

  • తెలంగాణ స్ఫూర్తితోనే ఏపీలో పోరాటం
  • జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌


విధాత : తెలంగాణ సాయుధ పోరాటం..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పోరాటాల స్ఫూరితోనే తాను ఏపీలో రౌడీలు, గుండాల పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. కొత్తగూడెం జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్ రావు గెలుపు కోరుతూ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడారు. నా ఇజం హ్యూమనిజం అని, శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలపై నన్ను కలిశాడని, తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివ నిదర్శనమన్నారు.


తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్యులనే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేన అన్నారు. బీఆర్ఎస్‌ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను ఇక్కడ తిరగక పోవడమేనని, దశాబ్దం వేచి చూశానని,అయినా తెలంగాణ ప్రజల, యువకుల ఆకాంక్షలు సాకారం కాలేదన్నారు. తెలంగాణాలో బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచినట్లు గుర్తు చేశారు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, బీసీ సీఎం కావాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందన్నారు.


నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని, అందుకోసం బీఆరెస్‌, కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు కష్టపడ్డాయని అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారనిన్నారు. అయితే పేపర్ల లీకేజీతో విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఆవిరై తీవ్ర నిరాశలో పడ్డారన్నారు. గత పాలకులు చేసిన తప్పే తెలంగాణలో బీఆరెస్ చేసిందన్నారు. సీఎం కేసీఆర్‌తో తనకు పరిచయమున్నా స్నేహం వేరు రాజకీయాలు వేరు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జల యజ్ఞం దోపిడీ వల్లే తెలంగాణ పోరాటానికి పునాది పడిందని పేర్కొన్నారు.


కౌలు రైతులను… రైతులు కాదనడం బాగో లేదన్నారు. ధరణిలో లోపాలున్నాయన్నారు. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత అని.. పారిపోరు జెండా పట్టుకుని నిలబడతారని పవన్ పేర్కొన్నారు. భవిష్యత్తు యువతదే అని చెప్పిన గద్దర్‌కు జోహార్లని పవన్ అన్నారు. నిధులు నీళ్ళు నియామకాలు నినాదంతో వచ్చిన తెలంగాణలో అనుకున్న స్థాయిలో లేదని విమర్శించారు.


ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయా


సూర్యాపేట: జనసేన పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. “నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయానన్నారు. ఫ్లోరోసిస్ బాధితులకు మంచినీరు అందించకపోవడం బాధ కలిగించిందన్నారు.


తెలంగాణ యువత బీఆరెస్ ప్రభుత్వంలో దగా పడిందని భావించి.. వారి పక్షాన నిలబడేందుకు వచ్చానన్నారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అందరిని సమానంగా చూసే నేత ప్రధాని మోదీ” అని పవన్ అన్నారు. తెలంగాణలో ఆడపడుచులు ఎక్కువగా ఆదృశ్యం అవుతున్నారని, మహిళలపై ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఆదిశగా జనసేన కృషి చేస్తోందన్నారు. జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చానన్నారు.

Latest News