Paytm Crisis | పేటీఎంపై ఆర్‌బీఐ కొరడా..! మరి ఫాస్టాగ్‌ పని చేస్తుందా.?

ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంకు ఆర్‌బీఐ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్‌లో ఎలాంటి డిపాజిట్లు సేకరించయొద్దని ఆర్‌బీఐ ఆదేశించింది

  • Publish Date - February 6, 2024 / 04:42 AM IST

Paytm Crisis | ప్రముఖ పేమెంట్స్‌ సంస్థ పేటీఎంకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం బ్యాంక్‌లో ఎలాంటి డిపాజిట్లు సేకరించయొద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. దీంతో పేటీఎం యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లు సైతం గందరగోళానికి గురవుతున్నారు. మార్చి ఒకటి నుంచి పేటీఎం ఫాస్టాగ్‌ పని చేస్తుందా? లేదా ? యూజర్లు ఆలోచిస్తున్నారు. అయితే, ఫాస్టాగ్‌ పని చేసినా అందులో డబ్బులు యాడ్‌ చేసే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. దీనికి కారణం పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో ఫాస్టాగ్‌లో టాప్‌ అప్‌ చేసుకోవడం కష్టంగా మారింది. ఫిబ్రవరి 29లోగా ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంటే తప్పా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు సేవలు పునరుద్ధరించే అవకాశం ఉండదు. అయితే, ఇప్పటి వరకు ఫాస్టాగ్‌ను పోర్ట్‌ చేసుకునే అవకాశం ప్రస్తుతం దేశంలో అందుబాటులో లేదు. అలాగే బ్యాంకు సైతం మొబైల్‌ నంబర్‌ పోర్టబులిటి తరహాలో పోర్ట్‌ చేయలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఆర్‌బీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మార్చి నెల నుంచి బ్యాలెన్స్‌ లేకపోతే పేటీఎం ఫాస్టాగ్‌ పని చేసే వీలుండదు. ఈ క్రమంలో పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లు తప్పనిసరిగా వేరే బ్యాంక్‌ నుంచి ఫాస్టాగ్‌ను తీసుకోవాల్సి రానున్నది. ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో పేటీఎంలో సంక్షోభంలోకి కూరుకుపోతున్నది.


వినియోగదారులపై ప్రభావం చూపకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేటీఎం తెలిపింది. మార్చి ఒకటో తేదీ వరకు ఏదోక మార్గం తీసుకువస్తామని చెప్పింది. అయితే, కంపెనీ ఏం చేస్తుందనే చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. పేటీఎం యాప్‌ను ఏమైనా మార్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫాస్టాగ్‌ యూజర్లకు గూగుల్​ పే, ఫోన్​ పే ద్వారా ఫాస్టాగ్స్​ని రీఛార్జ్​ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ వ్యాటెల్స్‌ ద్వారా పేటీఎం ఫాస్టాగ్‌ను ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు.

Latest News