Site icon vidhaatha

Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే పెద్ది

Peddi Sudarshan Reddy

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం సంక్షేమ బోర్డునుకానీ, ప్రత్యేక కార్పొరేషన్‌గానీ ఏర్పాటుచేయాలని నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో శనివారం ప్రస్తావించారు.

తెలంగాణ ఉద్యమంలో అనేకమంది తమ ప్రాణాలను బలిదానం చేశారని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలిచిందన్నారు. ఎందరో ఉద్యమకారులకు చేయూతనిచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇంకా అనేకమంది ఉద్యమకారులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గాయాల పాలై, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక, ఆరోగ్య సమస్యలు, కేసులతో సతమతమవుతున్నారని వివరించారు. పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని పెద్ది వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

దళిత బంధు, బీసీ రుణాలు, కార్పొరేషన్ పథకాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం తదితర పథకాల్లో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ స్పందించి బోర్డుగాని, కార్పొరేషన్‌గాని ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే ఉద్యమకారుల సమస్యలను పై పలువురు వినతి పత్రాలు సమర్పిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య పరిష్కరించకున్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రంగా ఉందన్నారు.

దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందంటూ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మానవీయ దృష్టితో ఈ సమస్యను పరిశీలించి, పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Exit mobile version