విధాత, మెదక్ బ్యూరో: మెదక్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో నియోజకవర్గంలోని మెదక్ పట్టణం, మెదక్ మండలం, రామాయంపేట, పాపన్నపేట, శంకరంపేట (ఆర్) మండలాల నుంచి ప్రజలు వచ్చి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను ఓపిగ్గా విన్న ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులకు వివరించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ఇల్లు, పెన్షన్లు, భూ సమస్యలు, ఇతర సమస్యలను ఎమ్మెల్యే కు 110 మంది లిఖితపూర్వకంగా తెలియజేశారు. వికలాంగుల బ్యాటరీ కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బ్యాటరీ వెహికల్స్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్ట్-బిలో ఉన్న భూ సమస్యలు కూడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కోర్టులో ఉన్న భూ సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలు పరిష్కరించాలని సిఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మీ కోసం కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారం అవుతుండడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మీ కోసం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. అధికారులు తమ పరిధిలో లేని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్,ఎమ్మార్వోలు శ్రీనివాస్, నవీన్ కుమార్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.