ఆరు ద‌శాబ్దాల్లో స‌గం మంచుకొండ‌లు మాయం.. పెరూ దేశంలో వాతావ‌ర‌ణ మార్పులు

దేశం గ‌త ఆరు ద‌శాబ్దాల్లో స‌గం మంచుకొండ‌ల (గ్లేషియ‌ర్స్‌) ను కోల్పోయింద‌ని పెరూ (Peru) శాస్త్రవేత్త‌లు వెల్ల‌డించారు. 2016 నుంచి 2020 మ‌ధ్య సుమారు 175 భారీ గ్లేషియ‌ర్‌ (Glaciers) లు అంత‌రించిపోయాయ‌ని వారు పేర్కొన్నారు

  • Publish Date - November 23, 2023 / 09:54 AM IST

విధాత‌: త‌మ దేశం గ‌త ఆరు ద‌శాబ్దాల్లో స‌గం మంచుకొండ‌ల (గ్లేషియ‌ర్స్‌) ను కోల్పోయింద‌ని పెరూ (Peru) శాస్త్రవేత్త‌లు వెల్ల‌డించారు. 2016 నుంచి 2020 మ‌ధ్య సుమారు 175 భారీ గ్లేషియ‌ర్‌ (Glaciers) లు అంత‌రించిపోయాయ‌ని వారు పేర్కొన్నారు. 2020 వ‌ర‌కు సేక‌రించిన శాటిలైట్ చిత్రాల‌ను ప‌రిశోధించి పెరూవియ‌న్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీచెర్చ్ ఆఫ్ మౌంటెన్ గ్లేసియ‌ర్స్ అండ్ ఎకో సిస్టమ్స్ శాస్త్రవేత్త‌ల బృందం దేశంలో గ్లేషియ‌ర్‌ల ప‌రిస్థితిపై ఒక నివేదిక‌ (Study) ను రూపొందించింది.


ఆ వివ‌రాల ప్ర‌కారం.. గత 58 ఏళ్లలో దేశంలో ఉన్న గ్లేషియర్‌లు 56.22 శాతం క‌నుమ‌రుగైపోయాయి. మొత్తంగా చూసుకుంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉండే హిమ‌నీ న‌దా (గ్లేషియ‌ర్స్‌) ల్లో 68 శాతం పెరూలోనే ఉంటాయి. అయితే ప్ర‌స్తుతం వెలువ‌డిన ఈ గ‌ణాంకాల ప్ర‌కారం చూస్తే వాటి ఉనికి ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. గ్లేషియ‌ర్‌లు క‌నుమ‌రుగు కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం భూ ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెరిగిపోవ‌డ‌మేన‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. వీటి వ‌ల్ల అవి వేగంగా క‌రిగిపోయి నీరులా మారిపోతున్నాయ‌ని.. తిరిగి మంచుకొండ‌ల్లా ఏర్ప‌డ‌టం త‌గ్గిపోయింద‌ని వాతావ‌ర‌ణ నిపుణులు పేర్కొంటున్నారు.


ఇవి క‌రిగిపోవ‌డం వ‌ల్ల ప‌ర్వ‌త‌ప్రాంతాల్లో చిన్న‌పాటి స‌ర‌స్సులు ఏర్ప‌డుతున్నాయి. ఇవి భ‌విష్య‌త్తులో మంచి నీటి వ‌న‌రులుగా ఉప‌యోగపడే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. భారీ వ‌ర‌ద‌లు పోటెత్త‌డం వంటి ప్ర‌మాదాలూ ఉన్నాయి. 1992లో ఇక్క‌డి గ్లేషియ‌ర్‌లు 2,399 చ‌ద‌ర‌పు కి.మీ. భూభాగంలో ఉండ‌గా.. 2020లో శాటిలైట్ చిత్రాల ద్వారా ప‌రిశీలించిన‌పుడు వాటి ఉనికి 1,050 చ‌ద‌ర‌పు కి.మీ.కే ప‌రిమిత‌మైంది.


కొన్ని ప‌ర్వ‌త‌ప్రాంతాల్లో అయితే హిమ‌నీన‌దాలు పూర్తిగా అంత‌రించిపోయాయ‌ని ఈ ప‌రిశోధ‌న వెల్ల‌డించింది. ఒక‌ప్పుడు భారీ గ్లేషియ‌ర్‌ల‌కు చిరునామా గా ఉండే చిలా అనే ప్రాంతం వాటిలో 90 శాతాన్ని కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. స‌మీప గతంలో చూసుకుంటే 2016 నుంచి 2020 మ‌ధ్య సుమారు 6 శాతం హిమ‌నీన‌దాలు క‌రిగిపోయాయ‌ని తేలింది.


ఈ ప‌రిణామాలు క్ర‌మంగా మంచి నీటి కొర‌త‌కు, వ‌ర‌ద‌ల‌కు దారి తీస్తాయ‌ని దేశ ప‌ర్యావ‌ర‌ణ మంత్రి ఆల్బీనా రూయిజ్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ర్వ‌త ప్రాంతంలో ఉండే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తౌల్యం కూడా దెబ్బతింటుంద‌ని తెలిపారు. సుదీర్ఘ కాలంలో గ్లేషియ‌ర్‌లు క‌రిగిపోకుండా మ‌నం నియంత్రించ‌లేమ‌ని.. కాక‌పోతే ఆ ప్ర‌క్రియ‌ను వాయిదా వేయ‌డం మ‌న చేతిలో ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాలుష్య నియంత్ర‌ణ‌, అడ‌వుల‌ను పెంచ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తామ‌ని పేర్కొన్నారు.

Latest News