Site icon vidhaatha

RSS నేత ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి

విధాత‌: ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేతల కార్యాలయాలు, ఇళ్లపై.. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాల తర్వాత తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడుల ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధురైలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి.

చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక ఆగంతకుడు పెట్రోల్ బాంబు విసిరాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత 24 గంటల్లో ఈ తరహా దాడులు జరగడం ఇది మూడోసారి.

తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం బయట పెద్దశబ్దం రావడం, మంటలు చెలరేగడం తో షార్టు సర్కూట్ అని మొదట అనుకున్నా తరువాత అదికాదని తేలిందని సీతారామన్ చెప్పారు. నిందితుడి ఫుటేజ్ లభించినట్టు తెలిపారు.

కోయంబత్తూరు లోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహాలో సెప్టెంబర్ 22న బీజేపీ కార్యాలయంపై దాడులు జరిగాయి. ఆ మరుసటిరోజే బీజేపీ నేత శరత్‌పై పెట్రోల్ బాంబ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసమయ్యింది. తాజాగా ఆర్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ సీతారాముడి ఇంటిపై దాడి జ‌రిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కేరళ లోని కన్నూరులో కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది.

Exit mobile version