విధాత: డెలివరీ కోసం వెళ్లిన మహిళలకు తప్పని పరిస్థితుల్లో వైద్యులు సర్జరీ నిర్వహించడం సాధారణమే. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీకి ఉపయోగించిన కత్తులు, దూది, ఇతర వస్తువులను కడుపులోనే ఉంచి కుట్లు వేయడం చూశాం.
తాజాగా ఓ వైద్యుడు కూడా గర్భిణికి డెలివరీ చేసి, ఆమె కడుపులో టవల్‌ను వదిలేసి కుట్లు వేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమ్రెహాకు చెందిన నజ్రానాకు నెలలు నిండాయి. పురిటి నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సైఫీ నర్సింగ్ హోంలో చేరింది. డాక్టర్ మత్లూబ్, సిబ్బంది కలిసి ఆమెకు పురుడు పోశారు.
కానీ డెలివరీకి ఉపయోగించిన టవల్‌ను మాత్రం కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. దీంతో బాలింత నజ్రానాకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. కడుపునొప్పి గురించి డాక్టర్‌ను అడగ్గా, బయట చలి ఎక్కువ ఉన్నందున అలా జరిగి ఉండొచ్చని చెప్పాడు. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకుని ఇంటికి పంపించారు.
ఇంటికి చేరుకున్న నజ్రానాకు కడుపు నొప్పి మరింత తీవ్రమైంది. చేసేదేమీ లేక మరో ప్రైవేటు ఆస్పత్రికి ఆమె భర్త తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరిశీలించగా, ఆమె కడుపులో టవల్ ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ సర్జరీ నిర్వహించి, కడుపులో ఉన్న టవల్‌ను బయటకు తీశారు
.
బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ సింఘాల్ స్పందించారు. విచారణ చేపట్టగా, సైఫీ నర్సింగ్ హోంకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టమైంది. డాక్టర్ మత్లూబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.