విధాత: ఎక్కాల్సిన బస్సో, రైలో వెళ్లిపోతేనే ఎంతో హైరానా పడిపోతాం. అనుకున్న రీతిగా గమ్యానికి చేరుకోలేక పోతే.. ఎన్నో ఇబ్బందులుంటాయి. అదే విమాన ప్రయాణమైతే… పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. సమయం వృథా ఒకటైతే.. మరో వైపు, ఫ్లైట్ టికెట్ డబ్బుల్లో నష్టపోవాల్సి వస్తుంది.
పంజాబ్ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన విమానం రాకపోకల షెడ్యూల్ మారిపోవటం కారణంగా.. ఏకంగా 32 మంది ప్రయాణికులను వదిలేసి స్కూట్ ఫ్లైట్ వెళ్లిపోయింది. అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ విమానం వాతావరణం సరిగా లేదనే కారణంతో పోయే టైం మార్చారు.
రాత్రి 7.55గంటలకు వెళ్లాల్సిన విమానాన్ని మధ్యాహ్నం 3.45కే పంపించి వేశారు. ఈ విషయం తెలియని ప్రయాణికులు రాత్రి వచ్చే సరికి అది వెళ్లిపోయిందని విని నిర్ఘాంతపోయారు. విమాన సర్వీసుల వేళల్లో మార్పులు వస్తే ముందే తెలియజేయాల్సిన బాధ్యత ఎయిర్ లైన్స్ అధికారులకు ఉండదా అని నిలదీస్తున్నారు. జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.