PM Modi
ఫ్రాన్స్: ప్రపంచ దేశాధినేతలకు ఇచ్చే బహుమానాల్లోనూ ప్రధాని మోదీ (Narendra Modi) తనదైన మార్క్ చూపిస్తారు. ప్రస్తుతం ఫ్రాన్స్ (France) పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్‌కు, ఆయన భార్యకు భారతీయత ఉట్టిపడే బహుమతులను అందించారు. మెక్రాన్‌కు గంధపు చెక్కతో తయారుచేసిన సితార్ ప్రతిరూపాన్ని ఇచ్చారు.
దక్షిణ భారతదేశపు కళాత్మకత ఉట్టిపడే ఈ సితార్‌పై సరస్వతీ దేవి, గణపతి, నెమళ్ల హొయలు మొదలైనవి చూడచక్కగా చెక్కి ఉన్నాయి. ఫ్రాన్స్ మొదటి మహిళ బ్రిగోటే మాక్రాన్‌కు తెలంగాణ పోచంపల్లి సిల్క్ చీరను గంధపుచెక్క బాక్సులో పెట్టి బహుమతిగా ఇచ్చారు.
ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిజబెత్ బోర్నేకు రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన మేజాబల్లను బహూకరించారు. దీనిలో మార్బ్‌ల్ ఇన్‌లే వర్క్ అనే కళాత్మకత ఉట్టిపడుతూ ఉంది. ఈ బల్ల తయారీలో రాజస్థాన్‌లో మక్రానాలో దొరికే అత్యంత నాణ్యమైన మార్బుల్‌ను ఉపయోగించారు.
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ఈల్ బ్రువాన్ పైవెట్‌కు కశ్మీరీ తివాచీ, ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపుచెక్కతో చేసిన ఏనుగు బొమ్మను ప్రధాని మోదీ బహూకరించారు. ప్రధాని అందించిన ఈ బహుమతులు.. భారతీయ కళాకారుల నైపుణ్యాన్ని చాటి చెబుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు శుక్రవారం జరిగిన ఫ్రాన్స్ జాతీయ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకున్న ఆయన.. శనివారం ఈ యూఏఈలో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని భేటీ అవుతారు.