తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: మోడీ

తెలంగాణలో ఎన్నో ఆశలు కన్పిస్తున్నాయి... ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

  • Publish Date - November 25, 2023 / 12:35 PM IST

  • 70 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు
  • దళిత సీఎం ముసుగులో కేసీఆర్ మోసం
  • మాదిగలకు న్యాయం చేసేందుకే కొత్త కమిటీ
  • తెలంగాణ ప్రజలతోనే ఉంటా.. బీజేపీని ఆదరించండి
  • కామారెడ్డి సభలో ప్రధాని నరేంద్ర మోడీ


విధాత, నిజామాబాద్: తెలంగాణలో ఎన్నో ఆశలు కన్పిస్తున్నాయి… ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కామారెడ్డిలో శనివారం బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి మాట్లాడారు. 7 దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదల ఆకాంక్షను ప్రతిబింబించేలా బీజేపీ మ్యానిఫెస్టో ఉందని, బీజేపీ ప్రజలకు చెప్పింది మాత్రమే చేస్తుందని చెప్పారు. రామమందిర నిర్మాణం చెప్పట్టి తీరినం, ఆదివాసీల కోసం సెంట్రల్ యునివర్సిటీని నిర్మించాం.. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీ పూర్తి చేయడమే అని అన్నారు.


తెలంగాణలో బీసీ సమాజానికి బీజేపీ మద్దతు పలుకుతున్నదని, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తామని మరోమారు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో దళితున్ని మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడన్నారు. తెలంగాణ అభివృద్ధి యాత్రలో మాదిగల అభివృద్ధికి తీవ్ర అన్యాయం జరిగిందని, మాదిగలకు న్యాయం చేయాలనే కొత్త కమిటీని వేసినట్లు పేర్కొన్నారు.


తెలంగాణ రైతులని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, రైతుల సంక్షేమమే బీజేపీ లక్ష్యమన్నారు. రూ.400 కోట్లతో పీఎం కిసాన్ ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారని, గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం లక్షా ముప్పై వేల టన్నులకి పైగా వరిని కోనుగోలు చేసినట్లు వివరించారు. బీజేపీ ప్రభుత్వం రైతులకి అదనపు లాభం చేకూర్చేలా ప్రయత్నం చేసిందని చెప్పారు. చెరకు హబ్ ని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, రూ.15 వేల కోట్లతో పశువులకి ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తున్నామన్నారు.


తెలంగాణ ఒక యువ రాష్ట్రం.. యువతకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలతో యువతని మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తెలంగాణలో స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. రెండు పార్టీల అధ్యక్షులు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు.. బుజ్జగింపు రాజకీయాలు రావని కామారెడ్డి ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలని మభ్యపెడుతున్నారని, టీఆర్ఎస్ నుండి హఠాత్తుగా బీఆర్ఎస్ గా మార్చుకున్నారన్నారు.


దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గద్దె దించారని, డిసెంబరు 3న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించుతారని నమ్మకం ఉందన్నారు. పేదల‌ కోసం ప్రత్యేకంగా పని చేసే పార్టీ బీజేపీ అని, కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన పార్టీ తమదే అన్నారు. తెలంగాణలోని లక్షలాది మందికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలతో ఉంటా.. అభివృద్ధికి సహకరిస్తా… ఒక్కసారి బీజేపీ పార్టీకి సహకరించాలని మోడీ కోరారు.

Latest News