కైలాసగిరి వద్ద ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా పార్వతి కుండ్, గుంజి వద్ద సరిహద్దులో ఐటీబీపీ ఆర్మీ సిబ్బందితో ప్రధాని నరేంద్రమోడీ సంభాషించారు

డెహ్రాడూన్‌: హిందువులకు పరమ పవిత్ర ప్రదేశంగా భావించే ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లా గౌరి కుండ్‌ వద్ద ప్రధాని నరేంద్రమోదీ గురువారం పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి శివుడు కొలువై ఉంటాడని భావించే ఆది కైలాశ్‌ పర్వతాన్ని దర్శించుకున్నారు. హెలికాప్టర్‌లో ఓం పర్వత్‌ను కూడా ఆయన వీక్షించారు.

ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. అందులో సంప్రదాయ దుస్తులతో మోదీ కనిపించారు. పవిత్రమైన పార్వతి కుండ్‌ దర్శనం, పూజలు నిర్వహించడం, అక్కడి నుంచి ఆది కైలాశ్‌ దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని మోదీ పేర్కొన్నారు. పార్వతికుంద్‌ తీరంలోని శివపార్వతి ఆలయంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆదికైలాశ్‌ పర్వతం ఎదుట చేతులు జోడించి.. ధ్యానం చేశారు. అక్కడి నుంచి గంజి గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.



 


అక్కడ స్థానిక చేతివృత్తి కళాకారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మోదీ వెంట ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధమి కూడా ఉన్నారు. అనంతరం గంజికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతన శివాలయమైన జగేశ్వర్‌ ధామ్‌ను దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి పితోరాగఢ్‌కు చేరుకుని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసి, అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు.