Ponnala Lakshmaiah | పాపం మాజీ టీపీసీసీ చీఫ్.. చెల్లుబాటుగాని పొన్నాల మాట! ఆయన సీటుకే గ్యారంటీ లేదు

Ponnala Lakshmaiah | జనగామలో కొమ్మూరితో కిరికిరి సొంత పార్టీలో తప్పని వర్గపోరు బీసీ వాదం గట్టెక్కించేనా? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట ప్రస్తుతం కాంగ్రెస్ లో చెల్లుబాటు కావడం లేదా? అంటే నిజమేనని అనిపిస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల.. ప్రస్తుతం గుర్తింపులేక తల్లడిల్లుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో […]

  • Publish Date - August 28, 2023 / 10:47 AM IST

Ponnala Lakshmaiah |

  • జనగామలో కొమ్మూరితో కిరికిరి
  • సొంత పార్టీలో తప్పని వర్గపోరు
  • బీసీ వాదం గట్టెక్కించేనా?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట ప్రస్తుతం కాంగ్రెస్ లో చెల్లుబాటు కావడం లేదా? అంటే నిజమేనని అనిపిస్తోంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న పొన్నాల.. ప్రస్తుతం గుర్తింపులేక తల్లడిల్లుతున్నారు. మరోమాటలో చెప్పాలంటే దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

రాష్ట్రంలో పర్యటించి, పార్టీ అభివృద్ధికి భాగస్వామ్యం కావడం సంగతేమోగానీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన జనగామలోనే దిక్కులేకుండా పోతోంది. సొంతపార్టీలో కుంపటి తప్పడంలేదు. జనగామలో తన ప్రాతినిధ్యం, ఉనికి కోసం తాపత్రయపడుతున్నారు. ఆయన అనుచరులు రంగంలోకి దిగి గాంధీభవన్ వద్ద నిరసనలు చేపడుతున్నారు.

గెలుపోటములిచ్చిన జనగామ

పొన్నాల లక్ష్మయ్య తన రాజకీయ రంగ ప్రవేశం సొంతూరు ఖిలాషాపూరు ఉన్న జనగామ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఆ గ్రామం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోకి వెళ్ళినా, ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకోలేదు. గెలుపోటములు చవిచూసినా ఒకే నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసి, సీపీఎం అభ్యర్థి ఏసిరెడ్డి నర్సింహారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

కాగా.. 1989 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చారగొండ రాజిరెడ్డిని ఓడించి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పొన్నాల తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. నేదుమల్లి జనార్ధన్ రెడ్డి, వైఎస్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ హయాంలో భారీనీటి పారుదల శాఖ మంత్రిగా వెలుగొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎదురులేని నాయకునిగా చక్రం తిప్పారు.

పీసీసీ చీఫ్ గా విఫలంతో తగ్గిన ప్రతిష్ట

తెలంగాణ రాష్ట్ర‌ ఏర్పాటు తర్వాత బీసీ నేతగా కాంగ్రెస్ అధిష్టానం తొలి పీసీసీ చీఫ్ గా పొన్నాలను నియమించింది. అందివచ్చిన అవకాశాన్ని కాపాడుకుని, నాయకత్వ పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. పొన్నాల ఆధ్వర్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమిచెందడమే కాకుండా, తాను ప్రాతినిధ్యం వహించిన జనగామలో పరాజయం పాలయ్యారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేరకుండా విశ్వాసం కల్పించడంలో ఫెయిలయ్యారు.

దీంతో పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. కేసీఆర్ ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. పొన్నాల వైఫల్యం వెనుక రెడ్డి సామాజికవర్గం నాయకుల వెన్నుపోటు రాజకీయాలు ఒక కారణమని ఆ పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను పీసీసీ చీఫ్ నుంచి తప్పించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పొన్నాల ప్రభ మసకబారుతూ వచ్చింది.

ఇదిలాఉండగా 2018 ఎన్నికల్లో పొన్నాలకు జనగామ టికెట్ చివరి నిమిషంలో కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీచేసే అవకాశం వస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో ఈ సీటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఆఖరి సమయంలో టికెట్ ఇవ్వడంతో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.

సొంత సెగ్మెంట్లో వర్గపోరు

పొన్నాల వరుసగా రెండు పర్యాయాలు ఓటమిపాలు కావడంతో జనగామకు దూరం దూరంగా ఉంటూ వచ్చారు. జనగామ చేజారి వర్గపోరు పెరిగింది. పొన్నాల అనుచరులు తప్ప ఆయన ప్రత్యక్ష భాగస్వామ్యం తగ్గించారు. పొన్నాల స్వయంకృతంతో సొంతపార్టీలో ప్రత్యర్థులు రూపొందారు.

2009 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నాల చేతిలో ఓటమి పాలైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి తన పలుకుబడి పెంచుకుంటూ వచ్చారు. దీంతో తనకు ఎదురులేదని భావించిన జనగామలో కొమ్మూరి కాంగ్రెస్ లో ప్రత్యర్థిగా మారారు. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు చేరుకున్నాయి. రెండు వర్గాలు ఇటీవల భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా పరస్పరం తన్నుకున్నారు.

ఈ పరిస్థితుల్లో జనగామ డీసీసీ అధ్యక్ష నియామకం చాలాకాలం పెండింగ్ లో పెట్టారు. ఇటీవల కొమ్మూరిని డీసీసీ అధ్యక్షుడిగా నియమించడంతో పొన్నాల జీర్ణించుకోలేక పోయారు. తన వర్గానికి ఇవ్వకపోగా ప్రత్యర్థికి అవకాశం కల్పించడంతో భగ్గునమండిపోతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఈ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు. మండల కమిటీల్లో సైతం తమ వర్గానికి మొండి చెయ్యి చూపెట్టారని పొన్నాల వర్గం గాంధీభవన్ లో లొల్లి చేసింది.

తాజాగా టికెట్ కోసం దరఖాస్తు చేసిన సందర్భంలో సైతం ఆయన వర్గం హల్ చల్ చేసింది. పొన్నాలకు టికెట్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే డీసీసీ అధ్యక్షున్ని నియమించుకోలేని పొన్నాలకు ఈ సారి టిక్కెట్ వస్తుందా? లేదా? అనే అనుమానం పెరిగింది.

ఈ విషయమొక్కటే కాకుండా కీలకమైన ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో సైతం పొన్నాలకు స్థానం దక్కలేదు. ఈ పరిణామాలతో టికెట్ గ్యారంటీ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు పొన్నాల వయస్సు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిటైర్మెంట్ వయస్సు, రెండు పర్యాయాలు వరుసగా ఓటమిపాలు కావడం పొన్నాలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

బీసీ వాదం గట్టెక్కించేనా?

రానున్న ఎన్నికల్లో బీసీలకు తగినన్ని స్థానాలు కేటాయించాలని గొంతెత్తుతున్న వీహెచ్, పొన్నం, మధుయాస్కీ తదితరులతో పొన్నాల గొంతుకలిపారు. బీసీ నేత పొన్నాలకే సీటు గ్యారంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ అధిష్టానానికి సన్నిహితుడని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆయన పలుకుబడి సన్నగిల్లిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలు వాటిని రుజువుచేస్తున్నాయి. బీసీ వాదం ఏ మేరకు గట్టెక్కిస్తుందా? చూడాలి. తాను పీసీసీ చీఫ్ గా, మంత్రిగా పనిచేసిన సమయంలో బీసీలను పట్టించుకోలేదనే విమర్శలు పొన్నాలపై ఉన్నాయి.

Latest News