Warangal | మూడు శాఖల పైనే ముఖ్యమంత్రి దృష్టి.. రాష్ట్రంలో పోలీసుల ఇష్టారాజ్యం: భట్టి

Warangal కెసిఆర్ ది రాజుల మనస్తత్వం ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుని తిరుగుతున్న నిరుద్యోగులు రాష్ట్రంలో నిత్యం హోరెత్తుతున్న నిరసనలు జనగామ జిల్లాలో ముగిసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు మినహా మిగతా శాఖలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిపాలన అస్తవ్యస్తంగా మారి, పారదర్శక పరిపాలన క‌రువైంద‌న్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క […]

  • Publish Date - April 30, 2023 / 10:35 AM IST

Warangal

  • కెసిఆర్ ది రాజుల మనస్తత్వం
  • ఉద్యోగాలు రాక గడ్డాలు పెంచుకుని తిరుగుతున్న నిరుద్యోగులు
  • రాష్ట్రంలో నిత్యం హోరెత్తుతున్న నిరసనలు
  • జనగామ జిల్లాలో ముగిసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు మినహా మిగతా శాఖలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిపాలన అస్తవ్యస్తంగా మారి, పారదర్శక పరిపాలన క‌రువైంద‌న్నారు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 45 వరోజు ఆదివారం ఉదయం జనగామ జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమై పెంబర్తి శివారులోని కాకతీయ కళాతోరణం జిల్లా సరిహద్దు వద్దకు చేరుకున్నది.

దారి పొడవునా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టగా విక్రమార్క మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి నేరుగా ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెంబర్తి గ్రామ శివారులో తాటి ముంజలు విక్రయించే బాలు నాయక్ ఎదురొచ్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. పెంబర్తి గ్రామంలోని శంకర్ హోటల్ చేరుకున్న పాదయాత్రకు శంకర్ కనకలక్ష్మీ దంపతులు వచ్చి విక్రమార్కను తమ హోటల్ వద్దకు తీసుకువెళ్లి చాయ్ తాపించి తమ అభిమానాన్ని ప్రదర్శించుకున్నారు. ఆ తర్వాత పెంబర్తి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాకతీయ కళాతోరణం వద్ద సీఎల్పీ నేత భట్టి మీడియాతో మాట్లాడారు.

పోలీసుల ఇష్టారాజ్యం

టిఆర్ఎస్ పాలనలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని కేసిఆర్ గాలికి వదిలేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల శాఖలకు నిధులు కేటాయించకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నద‌న్నారు.

రాబడి వచ్చే శాఖలపై దృష్టి పెట్టి ప్రజా సంపదను బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడి వారి జీవితాల్లో వెలుగులు నిండితే అది నిజమైన అభివృద్ధి. ఇండ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం కొత్త సచివాలయం కట్టుకుంటే ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి? అని ప్ర‌శ్నించారు.

కెసిఆర్ ది రాజుల మనస్తత్వం

ప్రజల మీద పడి సంపదను దోపిడీ చేసి ఆనాడు రాజులు రాజభవనాలు కట్టేవారని భట్టి విమర్శించారు. ప్రజలు ఆకలి కేకలతో అహంకారాలు చేస్తున్నా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు కేసీఆర్ అదే చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

రాష్ట్రంలో ప్రజలు ఇండ్లు లేక కొలువు లేక అల్లాడిపోతుంటే ప్రజల సంపదతో కొత్త సచివాలయం కట్టి అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు, సాగునీళ్లు కొలువులు సమకూర్చిన తర్వాత పాలకులు ఏ ప్యాలెస్లు కట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది ఉండ‌ద‌ని సూచించారు. ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి సచివాలయం తీసేసి కొత్తది కట్టుకున్నంత మాత్రాన కలిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు.

గడ్డాలు పెంచుకుని తిరుగుతున్న నిరుద్యోగులు

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు తిరిగి కొలువుల కోసం కొట్లాడాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమని విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా, లేక లేక నోటిఫికేషన్ వేసి ప్రశ్నాపత్రాన్ని లీకేజీ చేయడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నార‌న్నారు.

విద్యార్థి, నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తగులుతుందన్నారు. విద్యార్థి,యువత మేధ‌స్సు పక్క దారి పడితే సమాజానికి విస్పోటనం పేలినంత ప్రమాదకరం అవుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో నిత్యం నిరసనలు

ధర్నాలు లేని తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ పరిపాలనలో ప్రతి రోజు రాష్ట్రంలో ధర్నాలు జరుగుతూనే ఉన్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, ప్రశ్నాపత్రాల లీకేజీ పై నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు మహిళలు యువత వారి ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నాలు చేస్తూనే ఉన్నార‌న్నారు. కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు సుఖంగా ఎవరూ లేరు. కేసీఆర్ కుటుంబం, ప్రభుత్వ పెద్దలే సుఖంగా ఉన్నార‌న్నారు.

తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బహుళార్థసాధక ప్రాజెక్టులు కట్టింది లేదు. కృష్ణ, గోదావరి నదుల నుంచి అదనంగా ఒక ఎకరానికి సాగునీరు అందించింది లేదు. పెద్ద, పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసింది లేదు‌. రూ. 18 లక్షల కోట్లు బడ్జెట్ ఖర్చు చేశారు. ఇది చాలద‌న్న‌ట్టు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణ అప్పుల కుప్పగా ఈ ప్రభుత్వం మార్చిందన్నారు. ఆదివారంతో జనగామ జిల్లాలో భట్టి పాదయాత్ర ముగిసింది.

Latest News