Warangal | కాంగ్రెస్‌కు కొత్త ఉత్తేజం.. ఉమ్మడి జిల్లాలో ముగిసిన భట్టి పాదయాత్ర

Warangal వెలుగుచూసిన గ్రూపులలొల్లి ఎల్లాపూర్లో మొదలై పెంబర్త వద్ద ముగిసిన యాత్ర జిల్లాలో 500 కిలోమీటర్ల మైలురాయి ఏడు రోజులు 98 కిలోమీటర్ల యాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోట, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో […]

  • Publish Date - April 30, 2023 / 03:21 PM IST

Warangal

  • వెలుగుచూసిన గ్రూపులలొల్లి
  • ఎల్లాపూర్లో మొదలై పెంబర్త వద్ద ముగిసిన యాత్ర
  • జిల్లాలో 500 కిలోమీటర్ల మైలురాయి
  • ఏడు రోజులు 98 కిలోమీటర్ల యాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో నూతనోత్తేజాన్ని నింపింది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోట, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో యాత్ర చేపట్టారు.

ఈ యాత్రతో స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ వర్గాల్లో కదలిక తెచ్చింది. ఆ కదలికకు కొనసాగింపుగా భట్టి పాదయాత్ర మరింత దోహదం చేసింది. రేవంత్ యాత్ర 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించగా, విక్రమార్క పాదయాత్ర నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కొనసాగింది. కోమటిరెడ్డితో ఉన్న విభేదాల కారణంగా జనగామ పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యాత్ర చేపట్టలేదు.

ఈ కారణంగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ వైపు కూడా రేవంత్ దృష్టి సారించలేదు. దీంతో జనగామ, నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో రేవంత్ యాత్ర కొనసాగగా, మిగిలిన జనగామ తో పాటు స్టేషన్గన్పూర్ వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాలలో భట్టి విక్రమార్క తన యాత్రను పూర్తి చేశారు.

మిగిలిన నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్

ఉమ్మడి జిల్లాలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్ర పూర్తి చేయగా ఒక నర్సంపేట నియోజకవర్గంలో మాత్రం ఈ నాయకులెవరు యాత్ర చేపట్టకపోవడం గమనార్హం. ఈ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న దొంతి మాధవరెడ్డి తన నియోజకవర్గంలో యాత్రకు సానుకూలంగా స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి నర్సంపేట విడిచిపెట్టి మానుకోటలో యాత్ర కొనసాగించారు. దొంతి మాధవరెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

వెలుగు చూసిన గ్రూపుల లొల్లి

రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా దొంతి మాధవరెడ్డి దూరంగా ఉండగా, భట్టి పాదయాత్ర సందర్భంగా స్టేషన్గన్పూర్, జనగామలలో నెలకొన్న గ్రూపుల లొల్లి ఒక్కసారిగా బహిర్గతమైంది స్టేషన్గన్పూర్ లో ఇందిరా మరో కాంగ్రెస్ నేత కిష్టయ్యకు మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి. జనగామలో సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు యాత్ర సందర్భంగా తేటతెల్లమయ్యాయి.

ఓరుగల్లులో ముగిసిన విక్రమార్క యాత్ర

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ముగిసింది.

ఈనెల 24న హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం ఎల్లాపూర్ లో ప్రవేశించిన పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులోని కాకతీయ కళాతోరణం వద్ద ముగిసి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గం గుండ్లగూడెం గ్రామంలోకి ప్రవేశించింది.

ఏడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర హనుమకొండ, జనగామ జిల్లాలో 98 కిలోమీటర్ల మేర పూర్తి చేసుకున్నది. హనుమకొండలో 47 కిలోమీటర్లు, జనగామలో 51 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది.

500 కిలోమీటర్ల మైలురాయి

గత నెల 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర జనగామ జిల్లా నర్మెట్ట గ్రామానికి చేరుకునే నాటికి 500 కిలోమీటర్ల మైలు రాయిని ఈ జిల్లాలో పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి భట్టి విక్రమార్కను అభినందించారు.

నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో యాత్ర

వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు కొనసాగిన పాదయాత్రలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క లక్షల మంది ప్రజలను కలిసి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

ప్రజాసమస్యలు తెలుసుకున్న భట్టి

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పరిశీలించారు. కాకతీయ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలు తెలుసుకున్నారు. పాదయాత్రలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హనుమకొండ, నర్మెట్ట గ్రామంలో తడిసి ముద్దయ్యారు.

జనగామ జిల్లాలో మొక్కజొన్న పంటలు, తడిసిన ధాన్యం పరిశీలన చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఏడు రోజులపాటు కొనసాగిన పాదయాత్రకు జనం నీరాజనం పలికారు. గ్రామాల్లో స్థానిక సమస్యలను, వ్యక్తిగత సమస్యలను ప్రజలు భట్టి విక్రమార్కతో ఏ కరువు పెట్టి వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తులు చేశారు.

ప్రజల సమస్యలు వింటూ వారి వినతులు తీసుకుంటూ రానున్న ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. దారి పొడవున గ్రామ, గ్రామాన కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్రకు ఎదురొచ్చి స్వాగతం పలికి భట్టి విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.

Latest News