ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఈనెల 5న విచారణకు హాజరు
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు కేసు విచారణకు హాజరయ్యేందుకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు 14 నెలలుగా అమెరికాలోనే తల దాచుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఈనెల 5న కేసు విచారణ కొనసాగిస్తున్న సిట్ దర్యాప్తు బృందం ముందు హాజరవుతున్నట్లుగా సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లెటర్ రాసిచ్చారు. దీంతో ప్రభాకర్ రావుకు ప్రభుత్వం వెంటను పాస్ పోర్టు ఇవ్వాలని..పాస్ పోర్టు అందిన మూడు రోజుల్లో ఇండియాకు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.
ప్రభాకర్ రావుపై అరెస్టు వంటి తీవ్ర చర్యలు చేపట్టరాదని కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వన్ టైం ఎంట్రీ పాస్ పోర్ట్ అందిన వెంటనే ప్రభాకర్ రావు ఇండియాకు రాబోతున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరవుతున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ బృందానికి ప్రభాకర్ రావు సమాచారం అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ డీఎస్సీ ప్రణిత్ రావు, ఏసీసీలు భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్టు చేసిన సిట్ వారి విచారణ ప్రక్రియను ముగించింది. ప్రస్తుతం వారంతా బెయిల్ పై ఉన్నారు. ప్రభాకర్ రావును విచారించిన పిదపు అవసరమైతే మళ్లీ వారిని విచారించనున్నారు.