Pregnant Women Deaths | ప్రపంచవ్యాప్తంగా గర్భాధారణ సమస్యల కారణంగా ప్రతి రెండు నిమిషాలకో మహిళ మరణిస్తున్నది. ఐక్యరాజ్యసమితి నివేదికలో దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, గత 20 ఏళ్లలో మహిళ మరణాల రేటు మూడింట ఒకటో వంతు తగ్గింది. 2000-15 మధ్యకాలంలో మహిళల మరణాల కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని నివేదిక తెలిపింది. 2016-2020 మధ్య మరణాల రేటు స్థిరంగా కొనసాగుతూ వచ్చిందని, కొన్నిచోట్ల ఈ కాలంలో మరణాల రేటు పెరిగింది.
20ఏళ్లలో 34.3శాతం తగ్గిన మరణాలు
నివేదిక ప్రకారం.. గత 20 సంవత్సరాల్లో గర్భాధారణ సమయంలో మహిళ మరణాలు 34.3శాతం తగ్గాయి. 2000 సంవత్సరంలో లక్ష మంది పిల్లలు జన్మించిన సమయంలో 339 మంది మహిళలు చనిపోయారని, ఈ సంఖ్య 2020 నాటికి 223 తగ్గిందని పేర్కొన్నారు. 2020లో రోజుకు దాదాపు 800 మంది మహిళలు చనిపోగా.. ఈ లెక్కన ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ గర్భధారణ సంబంధిత సమస్యలతో ప్రాణాలు వదులుతున్నదని నివేదిక పేర్కొంది. ఇలాంటి కేసుల్లో బెలారస్‌లో 95.5శాతం తగ్గింపు నమోదైందని, అదే సమయంలో వెనిజులాలో అత్యధికంగా మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ మాట్లాడుతూ గర్భం అనేది మహిళలకు ఉత్తేజకరమైన, సానుకూల అనుభవంగా ఉండాలని, అయితే ఇప్పటికీ మిలియన్ల మంది మహిళలకు ప్రమాదకరమైన అనుభవంగా మిగిలిపోయిందన్నారు.
యూరప్‌లో 17శాతం పెరిగిన మరణాలు..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో గర్భాధారణ సమస్యల కారణంగా తలెత్తే మరణాలు 35శాతం తగ్గాయి. మధ్య, దక్షిణ ఆసియాలో 16శాతం తగ్గముఖం పట్టాయి. అదే సమయంలో యూరప్, ఉత్తర అమెరికాలో మాతృ మరణాల రేటు 17శాతం పెరిగింది. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల్లోనూ 15శాతం ఎక్కువయ్యాయి. మొత్తం ప్రసూతి మరణాల గణాంకాలలో 70 శాతం సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లోనే సంభవించాయి. ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికా, చాద్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, సౌత్ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్‌లలో మాతాశిశు మరణాల రేటు సగటు రేటు కంటే రెండింతలు ఎక్కువ ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.