20న పోచంపల్లిని సందర్శించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న ప్రపంచ ప్రఖ్యాత పట్టు చీరల కేంద్రమైన భూదాన్ పోచంపల్లిని సందర్శించబోతున్నారు

  • Publish Date - December 7, 2023 / 12:21 PM IST

విధాత : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న ప్రపంచ ప్రఖ్యాత పట్టు చీరల కేంద్రమైన భూదాన్ పోచంపల్లిని సందర్శించబోతున్నారు. కేంద్ర చేనేత జౌళి శాఖ, సెంట్రల్ వీవర్స్ సర్వీస్‌ల ఆధ్వర్యంలో పోచంపల్లిలో నిర్వహించనున్న థీమ్ పెవిలియన్ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రపతి శీతాకాల విడిది నిమిత్తం నెల 18 నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్ లో బస చేయనున్నారు. ముర్ము రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈనెల 20న పోచంపల్లిని సందర్శిస్తారు.


ఇక్కడ‌ పట్టుచీరల తయారీ, చేనేత కార్మికుల జీవనశైలి, చేనేత వస్త్రాల మార్కెటింగ్, ప్రమోటింగ్ వంటి విషయాలను, హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీలను ఆమె స్వయంగా క్షేత్ర పరిశీలన చేయనున్నారు. స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ లో 400 నుంచి 500 మంది చేనేత కార్మికులను ఉద్దేశించి ఆమె ప్రసంగించనున్నారు. నైపుణ్యంగల చేనేత కార్మికులతో ఆమె వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ కానున్నారు. పద్మశ్రీ, సంత్ కబీర్, జాతీయ అవార్డు పొందిన 16 మంది కళాకారులలో ఎంపిక చేసిన విజేతలతో రాష్ట్రపతి నేరుగా మాట్లాడుతారు.


అదనపు కలెక్టర్ భాస్కరరావు గురువారం రాష్ట్రపతి రాక సందర్భంగా ఏర్పాట్లపై పరిశీలన చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 11గంటల నుంచి మ 12.10వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తెలంగాణ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ ప్రగతిని ప్రతిబింబించే విధంగా ఒక థీమ్ ఫెవిలియన్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ చేనేత ప్రొడక్ట్స్ ను ప్రదర్శించనున్నామని తెలిపారు. ముత్యంపేట నారాయణపేట గద్వాల్, పోచంపల్లి, పుట్టపాక చేనేత ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు.


సభా ప్రాంగణంలో నాలుగు మగ్గాలను ఏర్పాటు చేసి వాటి మీద ట్రెండింగ్ చేనేత ఉత్పత్తులు నేసే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కత్ పట్టు, ట్రెండింగ్ పట్టు చీరలు తేలియా రుమాలు, గొల్లభామ యాక్సెసరీస్ ఉత్పత్తులు ఎలా చేస్తారో ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వీవర్స్ సర్వీసెస్ డైరెక్టర్ అరుణ్ కుమార్ ఎడీ, విద్యాసాగర్ ఎమ్మార్వో వీరాబాయి, ఆర్‌ఐ వెంకట్ రెడ్డి, టై అండ్ డై అధ్యక్షులు తడక రమేష్, ప్రధాన కార్యదర్శి భారత లవ కుమార్, పారిశ్రామిక వేత్త ఎన్నెల శివ కుమార్, పి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Latest News