విధాత, వరంగల్: రాష్ట్రంలో ఆదివాసీల కోసం చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గురువారం సమీక్ష నిర్వహించారు. గవర్నర్ తమిళిసై, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
గిరిజనుల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు మంత్రి సత్యవతిరాథోడ్ రాష్ట్రపతికి వివరించారు. హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో జరిగిన సమీక్షలో భాగంగా పీవీటీజీ సభ్యులు, విద్యార్థులతో మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము విద్య, వైద్యం, తాగు, సాగునీరు, కనీస మౌలిక వసతులపై ఆరా తీశారు.
ఆదివాసీలు, ప్రత్యేకించి పీవీటీజీల కోసం ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ సవివరంగా రాష్ట్రపతికి తెలిపారు. గిరిజనులకు రైతుబంధు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి కల్పిస్తున్నట్లు మంత్రి సత్యవతిరాథోడ్ ఈ సందర్భంగా వివరించారు.
రోడ్లు, విద్యుదీకరణపై దృష్టి సారించామని తెలిపారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రాథోడ్‌ను అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ పక్షాన రాష్ట్రపతి ద్రౌపదిముర్మును సత్యవతిరాథోడ్ సత్కరించి, అభివాదం చేశారు.