ప్రపంచ వ్యాప్తంగా సంచలనమ‌వుతున్న.. బ్రిటీష్ ప్రిన్స్‌ హ్యారిస్‌ ఆత్మకథ ‘స్పేర్‌’

రాజ‌కుటుంబంలోని చీక‌టి ఆవేద‌నా నాదం.. విడుదల రోజు రాత్రి 12 గంటల నుంచే క్యూ క‌ట్టిన ప్రజలు ‘హ్యారీపోటర్‌’ తర్వాత అతి ఎక్కువ కాపీలు అమ్ముడైన పుస్తకం విధాత: బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ ఆత్మకథ ‘స్పేర్‌’ బ్రిటన్‌లో సంచలనం సృష్టిస్తున్నది. పుస్తకం మార్కెట్లోకి విడుదలైన మొదటి రోజే 4లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డ్‌ సృష్టించింది. ఒక ‘నాన్‌ ఫిక్షన్‌’ పుస్తకం ఈ ఎత్తున అమ్ముడు పోవటం బ్రిటన్‌లో ఇదే తొలిసారి. ‘హ్యారీపోటర్‌’ తర్వాత అతి ఎక్కువ […]

  • Publish Date - January 12, 2023 / 01:24 PM IST
  • రాజ‌కుటుంబంలోని చీక‌టి ఆవేద‌నా నాదం..
  • విడుదల రోజు రాత్రి 12 గంటల నుంచే క్యూ క‌ట్టిన ప్రజలు
  • ‘హ్యారీపోటర్‌’ తర్వాత అతి ఎక్కువ కాపీలు అమ్ముడైన పుస్తకం

విధాత: బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ ఆత్మకథ ‘స్పేర్‌’ బ్రిటన్‌లో సంచలనం సృష్టిస్తున్నది. పుస్తకం మార్కెట్లోకి విడుదలైన మొదటి రోజే 4లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డ్‌ సృష్టించింది. ఒక ‘నాన్‌ ఫిక్షన్‌’ పుస్తకం ఈ ఎత్తున అమ్ముడు పోవటం బ్రిటన్‌లో ఇదే తొలిసారి. ‘హ్యారీపోటర్‌’ తర్వాత అతి ఎక్కువ కాపీలు అమ్ముడు పోయిన పుస్తకంగా స్పేర్‌ సంచలానాత్మకం అయ్యింది.

ప్రిన్స్‌ హ్యారీ రాజకుటుంబానికి సంబంధించి అంతఃపురంలో జరిగే వివక్షతను, నిర్బంధాలను తన ఆత్మ కథ ‘స్పేర్‌’లో బయటి ప్రపంచానికి చాటి చెప్పాడు. రాజకుటుంబంలో కింగ్‌ చార్లెస్‌, డయానాలకు రెండో కుమారుడిగా అతను ఎదుర్కొన్న అవమానాలను కళ్లకు గట్టాడు.

అలాగే కుటుంబంలో తాను ఎల్లప్పుడూ ఓ అదనపు వస్తువుగానే పరిగణింపబడ్డానన్న హ్యారీ ఆవేదన అందరినీ కదిలించి వేస్తున్నది. ఆ క్రమంలోనే ఇంకా అనేక సంచలనాత్మక విషయాలను హ్యారీ తన జీవిత కథలో రాశాడు. అందుకే బ్రిటన్‌లో పుస్తకం విడుదలయ్యే రోజు రాత్రి 12 గంటలకు వచ్చి దుకాణాల ముందు ప్రజలు లైన్లు కట్టి నిలుచున్నారు.

‘స్పేర్‌’లో ప్రిన్స్‌ హ్యారీ రాజకుటుంబంలో ఎదుర్కొన్న వివక్షను ఎంతో బాధామయ గొంతుతో రాశాడు. ఒక రోజు తన తండ్రి తన తల్లి డయానాతో మాట్లాడుతూ… తన రాజ కుటుంబానికి వారసున్ని ఇవ్వటమే కాకుండా.. ఒక స్పేర్‌ను ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నానని అనటం తాను విన్నానని హ్యారీ తన స్పేర్‌లో రాశాడు. అలాగే.. తన తండ్రి, తన అన్న ప్రిన్స్ విలియం ఎన్నడూ ఒకే విమానంలో ప్రయాణించే వారు కాదని తెలిపాడు. ఎందుకంటే… ఏదైనా జరుగరానిది (ప్రమాదం) జరిగితే.. వారసుడు ఉండాలి కదా.. అని వారలా చేసేవారని చెప్పుకొచ్చాడు.

మొత్తంగా ఇలా అన్ని విషయాల్లో తనను రాజకుటుంబం ఒక అదనపు వస్తువు(స్పేర్‌ పార్ట్‌)గానే చూసిందనీ, పరిగణించిందని వాపోయాడు. తన తల్లి డయానాను అమితంగా ప్రేమించే హ్యారిస్‌ తల్లి జ్ఞాపకాలను మరేదీ ఆక్రమించకూడదనే విధంగా వ్యవహరించేవాడు. తాను భారత పర్యటనకు వచ్చినప్పుడు తన భార్య మేఘన్‌ మార్కెల్‌తో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించామని తెలిపాడు.

ఆ సందర్భంగా మార్కెల్‌ తాజ్‌మహల్‌ వద్ద ఓ ఫోటో దిగుదామని అడిగితే.. వారించానని తెలిపాడు. ఎందుకంటే… తన తల్లికి తాజ్‌మహాల్‌ అంటే ఎంతో ఇష్టమనీ, ఆమె తాజ్‌మహల్‌ దగ్గర దిగిన ఫోటో జ్ఞాపకాలు తనకు ఇంకా పచ్చిగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

దీన్ని బట్టి ప్రిన్స్‌ హ్యారీ తల్లి డయానాను ఎంతగా ప్రేమిస్తాడో చెప్పకనే చెప్పాడు. అలాగే.. తన తల్లి మరణానికి సంబంధించి తనకున్న ప్రశ్నలకు జవాబులు ఇంకా మిగిలే ఉన్నాయని అంటున్నాడు. మొత్తం మీద బ్రిటిష్‌ రాజకుమారుడు ప్రిన్స్‌ హ్యారిస్‌ ఆత్మకథ ‘స్పేర్‌’ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమే అవుతున్నది. అలాగే.. రాజభవనం చీకటి గదుల్లోని వేదనలను ఆయన ఆత్మకథ ప్రపంచానికి వినిపిస్తున్నది.