విధాత : పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రగతిభవన్ రాజమహల్‌లో, ఫామ్ హౌజ్‌లో ఉండే ఈ సీఎంను ఇంటికి పంపించే సమయమొచ్చిందని , ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పిలుపునిచ్చారు.
మంగళవారం జహీరాబాద్ కాంగ్రెస్ రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు, విద్యార్థుల ఆశలు కల్లలైపోగా, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. పేపర్ల లీకేజీతో యువతకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు. పేదల ఆర్ధిక పరిస్థితి పెరుగలేదని, కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు.
కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణలతో కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందన్నారు. ధరల పెరిగి సామన్యులు కష్టాల పాలయ్యారని, ధరణితో రైతుల కష్టాలు పెరిగాయన్నారు. రుణమాఫీ అమలు కాలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం పేదలు, రైతులు, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరించిందన్నారు. ఆదానీ వంటి వారికి లక్షల కోట్ల రుణమాఫీ చేసి, పేదలకు మాత్రం సహాయం చేయడం లేదన్నారు.
బీజేపీ, బీఆరెస్, ఎంఐఎంలు మూడు పార్టీలు ఒకవైపు, కాంగ్రెస్ రెండోవైపు తెలంగాణ ప్రజల ముందు నిలబడ్డాయన్నారు. ప్రజలు కేసీఆర్‌కు బైబై చెపి మార్పు కోసం కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఎంఐఎం పార్టీ ఒవైసీ తెలంగాణలో బీఆరెస్‌కు. దేశంలో బీజేపీకి మద్దతుగా రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు.
తెలంగాణలో ఎంఐఎం బీఆరెస్ కోసం తొమ్మిది సీట్లలో, బీజేపీ గెలుపు కోసం దేశంలో ఇతర రాష్ట్రాల్లో 50-70సీట్లలో పోటీ చేస్తుందని విమర్శించారు. జాతీయ నేతగా దేశ ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి ఒవైసీకి లేదన్నారు. ప్రజలు బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంల కుమ్మక్కు రాజకీయాలకు బుద్ధి చెప్పి కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలన్నారు.