Priyanka Gandhi | కాంగ్రెస్‌లో ప్రియాంకం?

Priyanka Gandhi | విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండటంతో 13వ తేదీ వరకు ఉత్కంఠ తప్పదు. ఒకటీ అరా తప్ప అన్ని సర్వేలూ బీజీపీకి పరాభవం తప్పదని అంటున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారీగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం ఈ పార్టీకి అలవాటే. అయినా ప్రజాతీర్పు బలంగా వ్యక్తమైనప్పుడు ఇవేవీ పనిచేయవు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1977 […]

  • Publish Date - May 11, 2023 / 09:29 AM IST

Priyanka Gandhi |

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉండటంతో 13వ తేదీ వరకు ఉత్కంఠ తప్పదు. ఒకటీ అరా తప్ప అన్ని సర్వేలూ బీజీపీకి పరాభవం తప్పదని అంటున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీకి పాటు పుష్కలంగా నిధులు ఉన్నాయి. కులాల వారీగా చీల్చడం, విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి అధర్మ యుద్ధం ఈ పార్టీకి అలవాటే. అయినా ప్రజాతీర్పు బలంగా వ్యక్తమైనప్పుడు ఇవేవీ పనిచేయవు. ఎమర్జెన్సీ తరువాత జరిగిన 1977 ఎన్నికలు ఇందుకు ఉదాహరణ.

ఇప్పుడున్న అంచనా ప్రకారం – కాంగ్రెస్ మెజారిటీ సాధించవచ్చు. లేదా మెజారిటీకి దరిదాపుల వరకు వచ్చి ఆగిపోవచ్చు. కాంగ్రెస్ సొంతంగా అధికారం చేపడుతుందా లేక జేడీఎస్‌తో పంచుకుంటుందా అనేదే మిగిలి ఉన్నది. ఎంత మంది లింగాయతులు బీజేపీకి ఓటు వేశారు మొదలైనవన్నీ ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాదు. కొందరు వ్యక్తుల, కొన్ని పార్టీల భవిష్యత్తుపైనే కాకుండా ఇతర రాష్ట్రాలపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు.

కర్ణాటక ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక మరో మెట్టు పైకి ఎగబాక గలిగారు. కాంగ్రెస్ నాయకత్వం విషయంలో సోనియా మొదట్లో రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపారు. కానీ ఆయన కొన్ని సార్లు నిరాసక్తతను, కొంత మేర అసమర్థతను చాటుకున్నారు. ఆయన నిర్ణయాలు రాజకీయాల గురించి సాధారణ పరిజ్ఞానం ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ప్రథమ శత్రువుగా పరిగణించాలె. తన కున్న కొద్దిపాటి శక్తియుక్తులన్నీ బీజేపీని ఢీకొట్టడానికి ఉపయోగించుకోవాలె.

బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోవాలె. కానీ రాహుల్ గాంధీ సరళి ఇందుకు భిన్నంగా సాగింది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ వ్యతిరేకత కొద్దీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. అక్కడ పార్టీని మరింత స్థిరపరచుకోవాలె. యూపీ, బీహార్ వంటి చోట్ల బీజేపీ యేతర పక్షాలు పోరాడుతుంటే వారికి వదలి పెట్టాలె. ప్రజల ముందు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలిచి దేశాన్ని పాలించగలవనే నమ్మకం కలిగించాలె.

కానీ ప్రియాంకను ఒకటి రెండు శాతం ఓట్లున్న యూపీకి పరిమితం చేశారు. గెలువ లేని ప్రాంతాన్ని ఆమెకు అప్పగించి విఫల నేతగా నిలిపే ప్రయత్నం చేశారు. మిత్రపక్షాలతో కయ్యానికి దిగారు. దీంతో అటూ యూపీ, బిహార్‌లో, ఇటు మధ్యప్రదేశ్ రాజస్థాన్‌లలో దాదాపు సీట్లన్నీ మోదీకి బంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించుకున్నారు. ప్రతిపక్ష శిబిరంలో సోనియా పట్ల ఉన్న గౌరవాభిమానాలు రాహుల్‌కు లేవు. రాహుల్ దుర్మార్గుడనే అభిప్రాయం ఎవరికీ లేదు. కానీ ఆయన చేతకానితనమే ఆమోదించలేక పోయారు. మరోవైపు బీజేపీ ఆయనపై ‘పప్పు’ అంటూ ముద్ర వేసింది.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత, ఆ పదవి గాంధీ కుటుంబంలోని ఎవరికీ కట్టబెట్ట వద్దని రాహుల్‌ షరతు పెట్టారు. ఇది ప్రియాంకను కట్టడి చేయడమే. పార్టీ చర్చలలోనూ ఆమెను తక్కువ చేశారు. రాహుల్ గాంధీ వైదొలగాలని, ప్రియాంకకు పగ్గాలు ఇవ్వాలని పార్టీ కార్యకర్తల ఒత్తిడి మొదలైంది. ఇది చాలాసార్లు బహిరంగంగానే సాగింది. అనారోగ్యంతో ఉన్నా సరే సోనియా పార్టీ బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. ఇది బాధాకరమే కానీ, గత్యంతరం లేకపోయింది.

ఉదయపూర్ సంకల్ప ప్రకటన తరువాత – 2022 మే చివరలో సోనియా గాంధీ పార్టీలో ఉన్నత స్థాయి కమిటీలు వేశారు. ఇందులో సభ్యులు, విధుల సంగతులెట్లా ఉన్నా, పార్టీ సంస్థాగత బాధ్యతలను రాహుల్‌కే అప్పగించారు. కానీ ఎన్నికల టాస్క్ ఫోర్స్ బాధ్యత ప్రియాంక చేతిలో పెట్టారు. ఈ టాస్క్ ఫోర్స్ 2024 సార్వత్రక ఎన్నికల వరకు ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ అడ్డు లేకుండా, పార్టీని గెలిపించే బాధ్యతలు ప్రియాంక చేతిలో పెట్టారు. ఎన్నికల నిపుణుడు సునీల్ కనుగోలు ఆమెకు జోడీగా మారారు. రాజకీయ వివాదాలకు దిగకుండా ఎటువంటి ప్రకటనలు చేయకుండా, తెరవెనుక ఉండి సలహాలు, వ్యవహారం నడిపించడం సునీల్ కనుగోలు విధానం.

కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం ఉండటం అనుకూలాంశం. పార్టీ అధినాయకత్వంతో నిమిత్తం లేకుండానే, వారు పోరాడగలరు. పార్టీ నాయకత్వం చేయవలసింది వారికి సహకరించడమే. వారి సూచనలు వినకుండా, రాహుల్ గాంధీ నిర్లక్ష్యం చేసి అవమానించడం వల్లనే అస్సాం చేజారిపోయింది. అక్కడ బీజేపీని నెత్తికి ఎత్తుకున్నది అసంతృప్తికి గురైన కాంగ్రెస్ పరివారమే. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో సోనియా అండతో స్థానిక నాయకులే బీజేపీని దెబ్బతీశారు. హిమాచల్ ప్రదేశ్‌లో స్థానిక నాయకులే బీజేపీకి ఎదురొడ్డి పోరాడారు. హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీని అధికారంలోకి తేవడంలో ప్రియాంక చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. ఎన్నికల టాస్క్ఫోర్స్‌లో భాగంగా ఆమె తన సత్తా చాటుకున్నారు.

ఇప్పుడు కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ను పోరాట శక్తిగా నిలపడంలోనూ ప్రియాంక – కనుగోలు చాకచక్యం ఉన్నది. నాయకుల విభేదాలు పార్టీని దెబ్బతీసే స్థాయికి చేరకుండా నడిపించారు. అటు ఒక్కలిగల కంచుకోట అయిన పాత మైసూరు ప్రాంతంపై దృష్టిపెట్టి, ఇటు ఉత్తర, మధ్య ప్రాంతాలో, కోస్తాలో బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్న లింగాయతులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడంలో పార్టీ నాయకత్వం అలుపెరుగని కృషి చేసింది. కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రాభవం కాపాడటంలో చేసిన ప్రయత్నం ప్రియాంకను మరో మెట్టు పైకి ఎక్కించింది.

ప్రియాంక తెలంగాణపై కూడా దృష్టి సారించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓడించగలదా, రాష్ట్ర నాయకత్వ సమస్య అనేది వేరే చర్చ. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు, మేమే అని ప్రజలకు చాటి చెప్పుకోగలగడం కాంగ్రెస్ సాధించవలిసింది. దేశవ్యాప్తంగా ప్రియాంక ప్రతిష్ఠ పెరుగడానికి కర్ణాటక ఎన్నికలు దోహదపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని మేం ఎదుర్కోగలమనే సందేశాన్ని ప్రాంతీయ పక్షాలకు ఇవ్వగలుగుతుంది. ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ బేరసారాలకు దిగే స్థితికి చేరుకుంటుంది.

బీజేపీ కర్ణాటకలో అధికారం చేపట్టడానికి లింగాయతులను వాడుకొని ఆ తరువాత తొక్కివేస్తున్న తీరు రాజకీయ వర్గాలు గమనిస్తున్నాయి. దక్షిణాదిన ఏ సామాజిక వర్గం ఇక ముందు బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. దక్షిణాది రాజకీయాలు బీజేపీకి పొసగవు. ఇక్కడి విలువలు, సంస్కృతి భిన్నమైనవి. ఇప్పటికే హిందీని రుద్దడానికి, మిత్ర వ్యాపారవర్గాన్ని పోషిస్తూ, ప్రాంతీయ శక్తులను అణచివేయడానికి బీజేపీ చేస్తున్న కుటిల యత్నాలు దక్షిణాది ప్రజలకు అర్థమయ్యాయి. విద్వేష రాజకీయాలు, అధికార బలం, ఆర్థిక వనరులు, కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా, కర్ణాటకలో కాంగ్రెస్ మాదిరిగా బీజేపీ పునాదిని నిర్మించుకోలేక పోతున్నది.

తెలంగాణలోనూ ఆ మాత్రం కాలుమోపే పరిస్థితి కూడా బీజేపీకి లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోని బీజేపీ శ్రేణులను మరింత నీరు గార్చవచ్చు.

  • పరాంకుశం వేణుగోపాల స్వామి