తెలంగాణ ప్రజల కలల సాకారం కాంగ్రెస్‌తోనే సాధ్యం: ప్రియాంక గాంధీ

తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షల, కలల సాకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ అన్నారు.

  • Publish Date - November 25, 2023 / 12:30 PM IST
  • మధిర ప్రచార సభలో ప్రియాంక గాంధీ


విధాత : తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షల, కలల సాకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా మధిరలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తాను మధిరకు వచ్చే ముందు రోజు రాత్రి హైద్రాబాద్‌లో బస చేసినప్పుడు తన తల్లి సోనియాగాంధీకి తాను తెలంగాణలో మధిరకు వెలుతున్నానని చెప్పానన్నారు. అక్కడి ప్రజలకు ఏం సందేశం ఇస్తావని సోనియాగాంధీ నన్నూ ప్రశ్నించగా, సత్యం మాత్రమే చెబుతానని తాను బదులిచ్చానన్నారు.


తెలంగాణ ప్రజలు మంచి ప్రభుత్వం వస్తుందని ఆశపడ్డారని సోనియాగాంధీ తనకు చెప్పారన్నారు.తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసే బలమైన మంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పారన్నారు. రాహుల్‌గాంధీ జోడో యాత్ర తరహాలో భట్టి విక్రమార్క కూడా తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేశారన్నారు. తెలంగాణ ప్రజల కష్టనష్టాలను వారు తమ పాదయాత్రలో తెలుసుకున్నారన్నారు. అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల సంపదను దోచుకోగా వారి ఆస్తులు పెరిగాయన్నారు.


తెలంగాణ ప్రజల స్థితిగతులలో మాత్రం మార్పు రాలేదని, యువతకు ఉద్యోగాలు దక్కలేన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి చదివిస్తారని, నిరుద్యోగులు కూడా వ్యయప్రయాసలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతారన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేపర్ల లీకేజీ స్కామ్‌లతో నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిందన్నారు. లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం బాధలు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికి ఉద్యోగాలు వచ్చాయని, వారితో పార్టీ బీఆరెస్ ఎమ్మెల్యేలకు వందల ఎకరాల ఫామ్ హౌజ్‌లు వచ్చాయన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో కమిషన్లు దండుకుని ప్రజల సంపదను బీఆరెస్ పాలకులు దోచుకున్నారన్నారు.


రైతులకు మాత్రం రుణమాఫీ చేయలేదని, పండించిన పంటలను సక్రమంగా కొనుగోలు చేయలేదన్నారు. మహిళలు, పేదలు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. తన నానమ్మ ఇందిరాగాంధీ తనతో చెబుతుండే వారని, ప్రజలు తమ నాయకుల పనితీరును గమనిస్తునే ఉంటారని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని తన నానమ్మ ఇందిరాగాంధీ తనతో చెబుతుండేవారన్నారు. మీరు కూడా మీ సీఎం కేసీఆర్ బుద్ధిని గమనించే ఉంటారని, మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారని, ఆయనకు ఎన్నికల ముందే సంక్షేమ పథకాలు, ప్రజలు గుర్తుకొస్తారన్నారు.


మళ్లీ ఎన్నికల్లో గెలిచి ఎలా తన కుటుంబానికి రాష్ట్ర సంపదను దోచి పెట్టాలన్న ధ్యాస తప్ప ప్రజల కోసం ఆలోచించడం లేదన్నారు. ఎన్నికలొస్తున్నాయంటే చాలు కేసీఆర్‌ జనవరిలో చేయాల్సింది డిసెంబర్లో చేస్తున్నారన్నారు. పదేళ్లలో మాత్రం ప్రజా సంక్షేమం ఆయనకు గుర్తుకు రాలేదన్నారు. తాను పదేళ్లలో బీఆరెస్‌ పరిపాలన చూసి చెబుతున్నానని, ఆ పార్టీ మోసపూరిత విధానాలనలు తిప్పికొట్టాలని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే బీఆరెస్ కంటే మెరుగైన పథకాలు అమలు చేస్తుందన్నారు.


బీఆరెస్‌, బీజేపీలు రెండు ఒక్కటేనని, వారికి ఎంఐఎం తోడైందన్నారు. ఎంఐఎం తెలంగాణలో ఏడు స్థానాల్లోనే పోటీ చేస్తుందని, బీజేపీని గెలిపించేందుకు మిగతా రాష్ట్రాల్లో 30-40స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. హైద్రాబాద్‌లో ఉండే ఓవైసీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల నాయకుడైనా రాహుల్‌గాంధీని విమర్శిస్తుంటాడని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆరెస్‌, ఎంఎంలు ఆడుతున్న ఆటలను ప్రజలు అర్ధం చేసుకుని ఎన్నికల్లో ఆ పార్టీలను ఓడించాలన్నారు.


మీ అందరి ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన రాబోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ప్రజలే అత్యున్నతమని, ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రైతు భరోసాతో 15వేలు, వ్యవసాయ కూలీ కుటుంబాలకు 12వేలు, క్వింటాల్ ధాన్యానికి 500 బోనస్, మహిళలకు 2500 సహాయం, 500 సిలిండర్.


ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షలు, అంటి స్థలం, 4వేల పెన్షన్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 5లక్షలవిద్యా భరోసా, రెండు లక్షల ఉద్యోగాలు, మండలానికొక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. నా 30 నిమిషాల ప్రసంగంలో మూడుసార్లు కరెంటు పోయిందని, ఇలాంటి కాకుండా కాంగ్రెస్ పాలనరో 24 గంటలు కరెంటు ఇస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, ఇంటి స్థలం, ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు.


100మంది కేసీఆర్‌లు వచ్చిన నన్ను ఓడించలేరు : భట్టి


మధిరలో 100 మంది కేసీఆర్ లు వచ్చిన తనను ఓడించలేరని కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. శనివారం మధిరలో ప్రియాంకగాంధీ ప్రచార సభలో భట్టి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లు మధిరకు వచ్చి తాను ఓడిపోనంటూ ఎన్ని ప్రగల్భాలు పలికినా మధిర ప్రజలు తనను 50 వేల మెజార్టీతో గెలిపిస్తారన్నారు. మధిర పోరాటాల పురిటి గడ్డని, సాయిధ పోరాటానికి ఊపిరిలూదిన చైతన్య గడ్డ అన్నారు. అవినీతి, కుటుంబ, నియంతృత్వ బీఆరెస్ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపాలని, ప్రజా ప్రభుత్వాన్ని తీసుకరావాలని ప్రజలను కోరారు.


రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంపద అందరికీ సమానంగా అందుతుందని భావిస్తే, బీఆరెస్ నేతలే దోచుకు తిన్నారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. ఆదిలాబాద్ నుంచి మధిర వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ప్రకటించిందన్నారు.