యువత భవితకు కాంగ్రెస్ రావాలి: ప్రియాంక గాంధీ

తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు

  • Publish Date - November 25, 2023 / 10:23 AM IST
  • తెలంగాణను భ్రష్టుపట్టించిన బీఆరెస్ పదేళ్ల పాలన
  • పాలేరు.. ఖమ్మం రోడ్ షోలో ప్రియాంక గాంధీ


విధాత : తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, మట్టా రాగమయిల గెలుపు కోరుతూ నిర్వహించిన రోడ్ షో సభలలో ఆమె మాట్లాడారు.


బీఆరెస్ పదేళ్ల తెలంగాణ పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప వేరే ఎవరికి ఉద్యోగాలు దక్కలేదన్నారు. అధికారం నుంచి బీఆరెస్‌ను తప్పించండి..కాంగ్రెస్‌ను తీసుకురండి..ఉద్యోగాలు పొందండి అని ప్రియాంక పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతులు, ఆడబిడ్డలు, యువత ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు. బీఆరెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారన్నారు. తెలంగాణలో మార్పు కావాలని, కాంగ్రెస్ రావాలన్నారు.


కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. మహిళలు, దళిత, గిరిజనుల సంక్షేమానికి ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు నిర్ణయించుకున్నాన్నారు. అయితే భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.


దోపిడి, గడీల పాలనకు తెరదించాలి : పొంగులేటి


ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో సాగుతున్న దోపిడీ, దొరల పాలనకు తెరదించి సుస్థిర ప్రజాపాలన అందించే కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ పాలేరులో నన్ను ఓడించేందుకు కేసీఆర్‌ కుట్ర చేశారన్నారు. ఇందులో భాగంగానే స్థానిక బీఆరెస్‌ ఎమ్మెల్యేకు రూ.300కోట్లు పంపించారని ఆరోపించారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకుని హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు.


రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలను సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనకోసం ప్రతి గుండె పరితపిస్తుందని, ఈ ఎన్నికల్లో బీఆరెస్ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తామన్నారు.


ప్రియాంక గాంధీ రోడ్ షో చూసేందుకు ప్రజలు, మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు, సీపీఐ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పెద్ద తండా, నాయుడుపేట ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. రోడ్ షోలో తన వాహనంపై గిరిజన లంబాడీ మహిళలతో కలిసి ప్రియాంకంగాంధీ నృత్యం చేశారు. పెద్ద తండా వద్ద బహిరంగ సభలో ప్రియాంక తెలుగులో మాట్లాడారు.


మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి అంటూ పదే పదే తెలుగులో ప్రసంగించారు. జై తెలంగాణ అంటూ తెలుగులో నినదించారు. ప్రియాంక ప్రసంగాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలుగులోకి అనువదించారు. ఖమ్మం రూరల్ మండలం, కాల్వోడ్డు, పెద్దతండా, నాయుడుపేట, నాయుడుపేట క్రాస్ రోడ్, వరంగల్ క్రాస్ రోడ్ వరకూ ప్రియాంక గాంధీ రోడ్‌షో సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.