Pushpa 2: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో కోమాలోకి వెళ్లిపోయిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేడ్ వెలువడింది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. 3నెలలుగా వైద్యం అందిస్తున్నప్పటికి బాలుడి నరాల పనితీరులో ఏ మాత్రం పురోగతి లేదన్నారు. కళ్లు తెరిచి చూస్తున్నా ఎవర్నీ గుర్తు పట్టడం లేదని… ఆకలి కూడా తెలియడం లేదన్నారు.. లేచి కూర్చునే పరిస్థితి కూడా లేదన్నారు.
గత నెల రోజుల్లో ఒకటి రెండు రోజులు తప్ప మిగతా రోజులు వెంటిలేటర్ సాయం లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆహారాన్ని అందించడానికి 10 రోజుల క్రితం ఎండోస్కోపిక్ గ్యాస్టోస్టమీ ద్వారా శ్రీతేజ్ పొట్టలోకి ట్యూబ్ ను ఏర్పాటు చేశామని, ఆ ట్యూబ్ ద్వారా అవసరమైన పోషకాహారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నరాలు, మెదడు పనితనంలో ఎలాంటి పురోగతి లేదని, ఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం లేదని, సైగలను, మాటలను అర్ధం చేసుకోవడం లేదని వివరించారు. నాడి సంబంధిత సమస్యలతో, తలభాగం పైకెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు వివరించారు.
డిసెంబర్ 4న తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పటికి మూడు నెలలైన మెరుగుపడకపోవడం..వైద్యులు కూడా అతడు ఎప్పటిలోగా కోలుకుంటాడో అంచనా వేయలేకపోవడం గమనార్హం. తొక్కిసలాట జరిగినప్పుడు బ్రెయిన్‌కు చాలా సేపు రక్త ప్రసరణ ఆగిపోవడం అసలు సమస్యకు కారణంగా మారిందంటున్నారు వైద్యులు. ఆస్పత్రికి తరలించిన తర్వాత రక్త ప్రసరణ జరిగేలా చూసినప్పటికీ అప్పటికే మెదడుకు జరగాల్సినా నష్టం జరిగిపోయిందని.. ఈ కారణంగా కొద్ది రోజులు కోమాలో ఉన్న బాలుడు కోమా నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి అంత మెరుగ్గా మారడం లేదంటున్నారు. పుష్ప టీం ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఫాలో అప్ చేస్తుంది. శ్రీతేజ్‌ను ఎలాగైనా మామూలు మనిషిని చేయడానికి అవసరమైన వైద్య సాయం, ఖర్చులను భరిస్తుంది. విదేశీ వైద్య నిపుణుల సాయం కూడా తీసుకుంటున్నారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు
డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీతేజ్ తల్లిదండ్రుల వెంట ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లారు. అక్కడకు రాత్రి 9.30 గంటల సమయంలో సినిమాను చూసేందుకు సినీ హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చాడు. తమ అభిమాన హీరోను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో చోటుచేసుకున్న తొక్కిసలాటను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.ఈ సమయంలో అక్కడే ఉన్నశ్రీతేజ్, తల్లి రేవతిలు జనాల కాళ్ల మధ్యలో పడిపోయి నలిగిపోయారు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడి సొమ్మసిల్లిపోయారు. వెంటనే తల్లీకుమారులను అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్ చేసి బ్రతికించే ప్రయత్నం చేశారు.ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి రేవతి మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ తీవ్రగాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌తో పాటు పలువురిపై పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన అత్యవసర పిటిషన్‌గా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. బెయిల్ ఆర్డర్లు జైలు అధికారికి చేరేసరికి రాత్రి సమయం పట్టడంతో మరుసటి రోజు 13వ తేదీన జైలు నుంచి రిలీజ్ అయ్యారు.