మహిళలను వేధిస్తే కఠిన చర్యలు: రాచకొండ సీపీ తరుణ్ జోషి

మహిళలను, బాలికలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు

  • Publish Date - March 21, 2024 / 12:23 PM IST

  • 121మందికి కౌన్సిలింగ్‌
  • 67మందిపై కేసులు
  • డెకాయ్ ఆపరేషన్లతో 113మందిపై కేసులు

విధాత, హైదరాబాద్ : మహిళలను, బాలికలను వేధించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ తరుణ్ జోషి స్పష్టం చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తున్న 121 (మేజర్స్-64, మైనర్స్-57) మందిని 15రోజుల్లో షీ టీమ్స్ పట్టుకోగా, వారికి ఎల్బీనగర్ రాచకొండ సీపీ ఉమెన్ సెఫ్టీ వింగ్‌ క్యాంపు ఆఫీస్‌లో వారి కుటుంబ సబ్యుల సమక్షంలో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు.


ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. గత నెల 16 నుండి 29 వరకు 130 ఫిర్యాదులు అందగా, విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. అందిన ఫిర్యాదులలో ఫోన్ల ద్వారా వేధించనవి 14, వాట్సాప్ కాల్స్‌, మెసేజ్ ద్వారా వేధించినవి 8, సోషల్ మీడియా యాప్స్ ద్వారా వేధించినవి 20, నేరుగా వేధించినవి 88 ఉన్నాయని వివరించారు. వాటిలో క్రిమినల్ కేసులు 4, పెట్టి కేసులు 63 నమోదు చేయగా, మరో 55 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.


గత నెల 16 నుండి 29 వరకు షీ టీమ్స్ రాచకొండ మొత్తం 63 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 9425 మందికి మహిళా చట్టాలు, హక్కులు, నేరాలపై శిక్షలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మెట్రో రైళ్లలో డెకాయ్‌ ఆపరేషన్ నిర్వహించి మహిళా కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ప్రయాణిస్తున్న ఏడు మందిని పట్టుకుని ఫైన్ వేయించడం జరిగిందన్నారు.


షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ల ద్వారా కుషాయిగూడలో 33 మందిని, ఎల్బీనగర్, వనస్థలిపురం, మల్కాజ్‌గిరి, ఇబ్రహీంపట్నం ఏరియాలలో 73 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వేధింపులకు గురయ్యే మహిళలు, బాలికలు రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్ 8712662111కు లేదా షీమ్ అధికారుల ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ సమావేశంలో రాచకొండ ఉమెన్‌ సేఫ్టీ డీసీపీ టి. ఉష విశ్వనాథ్, ఎసీపీ వెంకటేశం, అడ్మిన్ ఎస్ఐ రాజు, షీటీమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Latest News