విధాత, హైదరాబాద్ : సాధారణంగా అత్తారింటి వాళ్లు పెట్టే టార్చర్ భరించలేక చాలామంది మహిళలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. కానీ, ఓ అల్లుడు తన అత్తారింటి వారి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32).. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన పూజతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి, రెండేళ్ల కూతురు కూడా ఉంది.
అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచి వేరు కాపురం పెట్టాలని భార్యతో పాటు అత్తమామలు హరిప్రసాద్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో పూజ తన కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ క్రమంలో ఈ నెల 2వ తేదీన పెద్దల సమక్షమంలో పంచాయితీ పెట్టగా.. అందరిముందే తన కొడుకుని దుర్భాష లాడడంతో పాటు పురుగుల మందు తాగి చనిపోవాలని రెచ్చగొట్టినట్లు హరిప్రసాద్ తల్లిదండ్రులు ఆరోపించారు. పంచాయితీ తరువాత పూజ కూతురిని తీసుకుని ఎప్పటిలాగే తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది.
ఈ నెల 18న వెల్దుర్తిలోని అత్తవారింటికి వెళ్లిన హరిప్రసాద్ ఇంటి ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హరిప్రసాద్ మంగళవారం మరణించాడు. తన కొడుకు మృతికి భార్య, అత్తమామలే కారణం అంటూ హరిప్రసాద్ తండ్రి మల్లేశ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టనట్లు తెలిపారు.
