బెంగళూరు : సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మగాడితో సమానంగా జీవించే హక్కు మహిళలకు కూడా ఉంది. అయితే, ప్రస్తుతం కొందరి ఆడవాళ్ల వ్యవహారం చూస్తే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. గత కొన్ని నెలలుగా ప్రియుడి కోసం తాళికట్టిన భర్తలను హత్య చేసిన సంఘటనలు అనేకం మనం చూశాం. తాజాగా భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదం బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని గిరినగర్ లో నివాసం ఉంటున్న గగన్‌కు.. మేఘనకు 8 నెలల క్రితం వివాహం జరిగింది.
పెద్దలు కుదుర్చిన పెళ్లి అయినా ఒకరికొకరూ బాగా దగ్గరయ్యారు. ప్రీవెడ్డింగ్ షూట్ లో కూడా నిజమైన ప్రేమికులుగా కలిసిపోయారు. తరువాత పెద్దల సమక్షంలో అంగరంగా వైభవంగా ఇరువురి వివాహం జరిగింది. అయితే, పెళ్లైన కొత్తలో గగన్, మేఘన ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఈ క్రమంలో చెలరేగిన అపార్థాలు గొడవలకు దారితీశాయి. గగన్ బ్యాంకు ఉద్యోగి కావడంతో ఉద్యోగరీత్యా బెంగళూరులో ఈ జంట నివాసముంటోంది. దీంతో వారిద్దరికి మంచిచెడులు చెప్పడానికి పెద్దలు లేకపోవడంతో ఇద్దరి మధ్య ఇగో పెరగడంతో గొడవలు జరిగాయి.
ఈ క్రమంలో గగన్ కు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని మేఘన అనుమానించడంతో గొడవ పెద్దదిగా మారింది. దీంతో మేఘన అలిగి పుట్టింటికి వెళ్లగా ఆమె తల్లిదండ్రులు సర్దిచెప్పగా తిరిగి మేఘన భర్త దగ్గరకు వచ్చింది. అయినా, ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు జరగడంతో పాటు భార్య అనుమానం వేధింపులు తట్లుకోలేక గగన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోడలి వేధించడం వల్లే తమ కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడని గగన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
